24 క్రాఫ్టుల్లో పనిచేస్తున్న సినీ కార్మికులకు 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఈ రోజు నుంచి షూటింగ్స్ బంద్ కు పిలుపునిచ్చింది. వేతనాలు పెంచి ఇచ్చిన నిర్మాతల సినిమాల షూటింగ్ లకు మాత్రమే అన్ని యూనియన్స్ కార్మికులు హాజరవుతారని, పెంచిన వేతనాలు కూడా ఏ రోజుకు ఆ రోజే చెల్లించాలని సినీ కార్మిక సమాఖ్య పేర్కొంది. కార్మికుల డిమాండ్స్ పై ఫిలింఛాంబర్ స్పందించింది.
ఫిలింఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ లేఖ విడుదల చేశారు. నిర్మాతలెవరూ ఫిలింఫెడరేషన్ డిమాండ్స్ ను అంగీకరించవద్దని ఈ లేఖలో దామోదర ప్రసాద్ కోరారు. ఏ నిర్ణయం అయినా ఫిలింఛాంబర్ తరుపునే తీసుకుంటామని, నిర్మాతలు సొంతంగా తీసుకోవద్దని తెలిపారు. సినీ కార్మిక సంఘ నిర్ణయం ఏకపక్షంగా ఉందని, ఇప్పటికే వారికి ఎక్కువ చెల్లిస్తున్నామని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. ఫిలింఛాంబర్, ఫిలింఫెడరేషన్ పట్టుదలగా ఉండటంతో షూటింగ్స్ సందిగ్ధంలో పడ్డాయి.




















