నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా “గుర్రం పాపిరెడ్డి”. ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెను సడ్డి, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. త్వరలో “గుర్రం పాపిరెడ్డి” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, సౌత్ ఇండియన్ కామెడీ సూపర్ స్టార్ యోగిబాబు చేతుల మీదుగా “గుర్రం పాపిరెడ్డి” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. “గుర్రం పాపిరెడ్డి” టీజర్ ఎలా ఉందో చూస్తే
భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 16వ శతాబ్దంలో రాయలసీమ ప్రాంతంలో కళింగ, బాలిక్, చేరి అనే మూడు సామ్రాజ్యాలు ఉండేవి అంటూ హీరో నరేష్ చెబుతుండగా టీజర్ మొదలవుతుంది. ప్రధాన పాత్రల పరిచయాలతో పాటు వీళ్లు శవాలను దొంగతనం చేయడం చూపించారు. ఈ శవాల దొంగతనం వెనక కళింగ పోతురాజుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు ఈ కళింగ పోతురాజు ఎవరు, ఈ శవాల దొంగతనం సమస్యలో ప్రధాన పాత్రధారులంతా ఎలా ఇరుక్కుపోయారు అనేది టీజర్ లో ఆసక్తిని కలిగించింది. జడ్జి పాత్రలో బ్రహ్మానందం, ఉడ్రాజుగా యోగిబాబు టీజర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. ఓ డిఫరెండ్ డార్క్ కామెడీ కథను “గుర్రం పాపిరెడ్డి” సినిమాలో చూడబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది.




















