తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని, తను చేసే మంచి పని ద్వారానే వారికి సమాధానం చెబుతానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు ఆయన అతిథిగా మెగా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈసారి ఇండిపెండెన్స్ డేను ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త, హీరో తేజ సజ్జ, తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ – ఆ మధ్య ఓ రాజకీయ నాయకుడు నన్ను అనవసరంగా తిట్టాడు. నేను అప్పటికి రాజకీయాల్లో కూడా లేను. తన మాటలకు ఒక మహిళ నొచ్చుకుని ఎందుకు చిరంజీవి గారిని తిడుతున్నావంటూ నిలదీసింది. ఆ మహిళ గతంలో తన బిడ్డకు మా బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ సహాయం పొందిన కృతజ్ఞతతో అలా మాట్లాడింది. సోషల్ మీడియాలో కూడా నన్ను ఎవరెవరో తిడుతుంటారు. నేను అవన్నీ పట్టించుకోను. నేను చేసే మంచి పని, నా నుంచి సహాయం పొందిన వాళ్లే సమాధానం చెబుతారు. అన్నారు.




















