సినీ కార్మికులకు 50శాతం వేతనాలు పెంచుతాం…కానీ – నిర్మాత ఎస్ కేఎన్

ఇప్పటికే సరైన వ్యాపారం లేక ఆర్థికంగా నష్టపోతున్న చిన్న నిర్మాతలను 30 శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు చేపట్టిన సమ్మె ఇబ్బంది పెడుతోంది. ఈ విషయంపై ప్రెస్ మీట్ నిర్వహించి తమ సమస్యలు చెప్పుకున్నారు పలువురు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో ఎస్ కేఎన్, ధీరజ్, రాజేశ్ దండా, ప్రైమ్ షో చైతన్య, ఛాయ్ బిస్కట్ శరత్, అనురాగ్, మధుర శ్రీధర్, మహేశ్వర్ రెడ్డి, రాకేశ్ వర్రె, బెన్నీ, తదితర నిర్మాతలు పాల్గొని వాస్తవంగా ఫిలిం ప్రొడక్షన్ లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలిపారు. కార్మికులు సమ్మె విరమించి ప్రొడ్యూసర్స్ కు సహకరించాలని, అందరం బాగుండాలనే ధోరణిలో వ్యవహరించాలని నిర్మాతలు కోరారు. డిమాండ్స్ పెట్టే సమయంలో తమ హక్కులను కూడా సినీ కార్మికులు చూసుకోవాలని చిన్న నిర్మాతలు అన్నారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – సినీ కార్మికులకు 30శాతం కాదు 50శాతం పెంచుతాం. కానీ సినిమా మీద మేము పెట్టిన ఖర్చు థియేటర్, ఓటీటీ ఏ రూపంలో అయినా తిరిగి తీసుకురాగలరా. మేము పాన్ ఇండియా సినిమాలు తీయడం లేదు. టికెట్ రేట్స్ పెంచుకోవడం లేదు.మా పరిస్థితి వేరు. చిన్న సినిమాలకు 25 పర్సెంట్ వేతనాలు తగ్గించండి అని గతంలో చేసుకున్న ఒప్పందాన్ని ఫెడరేషన్ సభ్యులు పాటించడం లేదు. పెద్ద సినిమాలతో సమానంగా వేతనాలు తీసుకుంటున్నారు. షూటింగ్ కు ఇంతమందిని తీసుకోవాలి, ఇంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసే హక్కు మీకెక్కడిది. అసలు బిజినెస్ లేదని మేము బాధపడుతుంటే 30 పర్సెంట్ పెంచాలని డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఏ హీరో కూడా మాకింత ఇవ్వకుంటే షూటింగ్స్ బంద్ అనడం లేదు. అన్నారు.