ప్యూర్ ఎంటర్ టైన్ మెంట్ తో “లిటిల్ హార్ట్స్” నవ్విస్తుంది – నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ

“90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ మౌళి తనుజ్, “అంబాజీపేట మ్యారేజి బ్యాండు” మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ “లిటిల్ హార్ట్స్”. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. “90s మిడిల్ క్లాస్ బయోపిక్” ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ “లిటిల్ హార్ట్స్” మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు. “లిటిల్ హార్ట్స్” సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ హైలైట్స్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాతలు ఆదిత్య హాసన్, సాయి కృష్ణ.

నిర్మాత ఆదిత్య హాసన్ మాట్లాడుతూ – “లిటిల్ హార్ట్స్” సినిమా కథ విన్నప్పుడు ఇది నా శైలి రచనతో ఉన్న కథ అనిపించింది. మనమంతా బాగా రిలేట్ అయ్యే కథ ఇది. ప్రేక్షకులు రెండు రకాల కథల్లో లీనమవుతారు. ఒకటి తాము చేయాలనుకున్నవి చూపించే కథలు, రెండు తాము చేసినవి చూపించే స్టోరీస్. ఇది రెండో తరహా మూవీ. ప్రేక్షకులు తమ లైఫ్ లో కూడా ఇలా జరిగిందే అని సినిమా చూస్తున్నంత సేపు రిలేట్ అవుతారు. కథ విన్నప్పుడు ఒక ప్రేక్షకుడిగా నేనూ ఎంజాయ్ చేశాను. బాగా రిలేట్ అయ్యాను. ఈ సినిమాకు రైటింగ్, ఆర్టిస్ట్ సెలెక్షన్, ఇతర అంతా సాయి మార్తాండ్ చూసుకున్నాడు. రైటింగ్ సైడ్ నా ఇన్వాల్వ్ మెంట్ ఏమీ లేదు. ప్రొడక్షన్ పరంగా నేను ఏ సపోర్ట్ చేయగలనో మాకున్న బడ్జెట్స్ లో చేశాను. ఇందులో సీరియస్ లవ్ స్టోరీ ఏం లేదు. టీనేజ్ లో ఉండే ఇమ్మెచ్యూర్ లవ్ స్టోరీ చూపిస్తున్నాం. అది సరదాగా సాగుతుంది. అన్నారు.

నిర్మాత సాయి కృష్ణ మాట్లాడుతూ – “90s మిడిల్ క్లాస్ బయోపిక్” లాగే లిటిల్ హార్ట్స్ కూడా అలాగే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. ముందునుంచీ ఈ కథను థియేట్రికల్ మూవీ చేయాలనే ప్లాన్ చేశాం. ఈ మూవీలో హీరో హీరోయిన్స్ కు చదువురాదు. చదువు రాని అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఫన్నీ స్టోరీ ఇది. వంశీ నందిపాటి, బన్నీ వాస్ గారు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 200 థియేటర్స్ లో మా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 3న మూడు సెంటర్స్ లో ఫ్రీ షోస్ ఇంటర్ విద్యార్థుల కోసం వేస్తున్నాం. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిస్తాం. అన్నారు.