రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!


నటీనటులు: రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి, అను ఇమ్మాన్యుయేల్, రావు రమేష్, రోహిణి తదితరులు
రచన, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్
నిర్మాత: ధీరజ్ మొగిలినేని, కొప్పినీడి విద్య
సమర్పణ: అల్లు అరవింద్
మ్యూజిక్: హేషమ్ అబ్దుల్ వహబ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫి: కృష్ణన్ వసంత్
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
రిలీజ్ డేట్: 2025-11-07

కథ: భూమాదేవి (రష్మిక) జన్మించగానే తల్లిని కోల్పోయిన అమ్మాయి. తల్లిలేని బాధను భర్తీ చేస్తూ, ఆమెను పెంచుతాడు తండ్రి రావు రమేష్. చిన్నప్పటి నుంచే కళలంటే, సాహిత్యంపై ఆసక్తి ఉన్న భూమాదేవి, రామలింగయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఎంఏ లిటరేచర్‌లో చేరుతుంది. చదువులో మునిగిపోయిన ఆమెకు జీవితంలో ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ అనూహ్యంగా అదే కాలేజీలో చదివే విక్రమ్ (దీక్షిత్ శెట్టి) కంటపడుతుంది. తొలిచూపులోనే భూమాదేవిని ప్రేమిస్తాడు విక్రమ్, ఆ ప్రేమకు భూమా కూడా సమాధానం ఇస్తుంది. ఒక ముద్దుతో మొదలైన వారి ప్రేమలో ఆమెలో అనేక మార్పులు చూపుతుంది. ప్రేమ పెరిగేకొద్దీ విక్రమ్‌లో ఈర్ష్య, అధికారం భావాలు చెలరేగి, భూమాదేవి స్వేచ్ఛను కట్టిపడేస్తాయి. అతని అహంకారం, అనుమానం, హింసాత్మక ప్రవర్తనతో బాధపడుతూ భూమాదేవి తన ఆత్మగౌరవం కోసం పోరాడే ప్రయాణమే ఈ కథ సారాంశం.

నటీనటులు: రష్మిక మందన్న ఈ చిత్రంలో భూమాదేవి పాత్రను కేవలం నటించలేదు.. జీవించింది. అమాయకత్వం, బాధ, ఆత్మగౌరవం మధ్య జరిగే భావోద్వేగ యాత్రను ఆమె అద్భుతంగా ఆవిష్కరించింది. ప్రతి సీన్‌లో రష్మిక తన హావభావాలతో ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఈ సినిమాతో ఆమె నేషనల్ అవార్డు స్థాయి నటనను ప్రదర్శించిందని చెప్పడంలో సందేహం లేదు. భూమా పాత్రతో ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అవుతారు. ఈ సినిమా రష్మిక కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పాలి. భవిష్యత్తులో మరిన్ని లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో ఆమె కనిపించడం ఆశ్చర్యం కాదు.

హీరోగా నటించిన దీక్షిత్ శెట్టి తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ చూపిన ఉత్సాహాన్ని గుర్తు చేసే సన్నివేశాల్లో అతను చక్కగా ప్రదర్శించాడు. ప్రేమలో మునిగిన యువకుడిగా, ఈర్ష్యతో నిండిన వ్యక్తిగా — రెండు షేడ్స్‌లోనూ అతని నటన విశ్వసనీయంగా ఉంది. రూపంలో క్యూట్‌గా, ప్రదర్శనలో మాచ్యూర్‌గా కనిపించిన దీక్షిత్ భవిష్యత్తులో మంచి నటుడిగా నిలవగలడు.

రావు రమేష్ సాధారణ తండ్రి పాత్రలో తన సహజ నటనతో మెప్పించాడు. రాహుల్ రవీంద్రన్ కాలేజ్ లెక్చరర్‌గా, జీవిత విలువలను చెప్పే సన్నివేశాల్లో చక్కగా నటించాడు. అను ఇమ్మాన్యుయేల్ తన పాత్రకు తగినంత న్యాయం చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో మంచి పనితీరు కనబరిచారు.

మొత్తం మీద, రష్మిక భూమాదేవిగా మరిచిపోలేని ప్రదర్శన ఇచ్చిన ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన అనుభవాన్ని ప్రేక్షకులకు అందిస్తుంది.

సాంకేతిక నిపుణులు: హేషమ్ అద్భుతమైన పాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, ప్రశాంత్ ఆర్. విహారి అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత లోతును తెచ్చింది. ప్రతి సన్నివేశంలో పాత్రల భావోద్వేగాలను, సన్నివేశంలోని తీవ్రతను అతను సంగీతం ద్వారా అద్భుతంగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ పరంగా మంచి పని కనబడినా, కలర్ గ్రేడింగ్ విషయంలో కొంత కేర్ తీసుకుని ఉంటే రిచ్‌గా ఉండేది. సినిమా మొత్తం డల్ లుక్‌లో ఉండడం వల్ల థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది.

దర్శకుడు, కథకుడు, రచయిత రాహుల్ రవీంద్రన్ పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. మహిళా సాధికారత అనే అంశాన్ని ఉపదేశం లేకుండా, మెటాఫరికల్‌గా చూపించిన తీరు ఎంతో బాగుంది. హీరోయిన్ తనలో తానే కుచించుకుపోతుంది అనే భావాన్ని గర్భంలోని శిశువు మాదిరిగా చూపిన విజువల్ అప్రోచ్ ప్రేక్షకులను ఆలోచనలో పడేస్తుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో ఆమె అయోమయాన్ని ప్రతిబింబించే సన్నివేశం కూడా భావోద్వేగంగా నిండిపోయింది. రచయితగా, దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ :

రష్మిక నటన

సంగీతం

కథ, మాటలు

మైనస్ పాయింట్స్:

స్లో నేరేషన్

తీర్పు: భావోద్వేగాలతో నిండిన సున్నితమైన ప్రయాణం. రష్మిక మందన్న అద్భుతమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం సినిమాకు ప్రాణం పోశాడు. మొత్తానికి, మహిళా సాధికారతను సున్నితంగా చూపిన విలువైన చిత్రం.

Rating : 3/5