Sridevi Vijaykumar gave clarity on why she stopped films after marriage

Sridevi Vijaykumar: సినిమా పరిశ్రమలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే క్రేజ్ ఉన్నప్పుడే హీరోయిన్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు. అయితే కొందరు నటీమణులు మాత్రం వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే ఏదో ఒక కారణం చేత వెండితెర‌కు దూరం అవుతూ ఉంటారు. శ్రీదేవి విజయ్ కుమార్ కూడా ఆ కోవకే చెందుతుంది. ప్రముఖ తమిళ సినిమా నటులైన విజయ్ కుమార్, మంజుల దంపతుల చిన్న కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి.. 1992లో రిక్షా మామ అనే తమిళ చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది.

Sridevi Vijaykumar gave clarity on why she stopped films after marriage

కోలీవుడ్ లో అనేక సినిమాల్లో బాలనటిగా నటించి మెప్పించింది. 2002లో ప్రభాస్ డెబ్యూ మూవీ ఈశ్వర్ ద్వారా శ్రీదేవి హీరోయిన్ గా మారింది. ఆ త‌ర్వాత త‌రుణ్ స‌ర‌స‌న‌ నిన్నే ఇష్టపడ్డాను చిత్రంలో నటించి ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఆపై తెలుగులో నిరీక్షణ, పెళ్లికాని ప్రసాదు వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. త‌మిళ్‌, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేసింది. తన అందం, అభినయం తో తక్కువ సమయంలోనే శ్రీదేవి మంచి క్రేజ్ సంపాదించుకుంది.

అయితే సినిమాల్లో జోరుగా అవకాశాలు వస్తున్న సమయంలోనే శ్రీదేవి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. వ్యాపారవేత్త రాహుల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం శ్రీదేవి కెరీర్ పతనమవుతూ వచ్చింది. 2011లో వీర, 2016లో కన్నడ మూవీ లక్ష్మణ అనే చిత్రాల్లో శ్రీ‌దేవి సహాయక నటిగా కనిపించింది. అవే ఆమె చివరి చిత్రాలు. అప్పటినుంచి ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన శ్రీదేవి.. 2021లో టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది. పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తూ అలరిస్తోంది. ఇక‌పోతే పెళ్లి తర్వాత భర్త కారణంగానే శ్రీదేవి ఫిల్మ్ కెరీర్ నాశ‌నం అయింద‌ని.. అత‌ను అడ్డు చెప్ప‌డం వ‌ల్లే యాక్టింగ్‌కు దూర‌మైందని గతంలో ప్రచారం జరిగింది.(Sridevi Vijaykumar)

Also Read: Tollywood: తెలుగు తెర‌పై అస్స‌లు సెట్ అవ్వ‌ని హీరో-హీరోయిన్ల వ‌ర‌స్ట్‌ కాంబినేషన్స్‌ ఇవే..!

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న శ్రీదేవి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసలు నిజమేంటో బయటపెట్టింది. వివాహం అనంతరం సినిమాలు చేయొద్దని నాకు ఎవ్వ‌రూ అభ్యంతరం చెప్పలేదు. నా భర్త మూవీస్ చేయమని ఎంత‌గానో ప్రోత్సహించేవారు. టాలెంట్ ఉంది, ఇష్టముంది.. మరి ఎందుకు సినిమాలు మానేశావని తరచూ అడిగే వారు. కానీ పెళ్లి తర్వాత కొత్త లైఫ్ ప్రారంభించ‌డంతో దానికి అలవాటు పడటానికి చాలా సమయం పట్టింది. దాంతో అనుకోకుండానే గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏదో ఒక షో ద్వారా ఇండస్ట్రీలోనే ఉంటున్నాను. అందుకు హ్యాపీగా ఉంది అంటూ శ్రీదేవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Join WhatsApp