raviteja mister bachachan movie review

నటీనటులు: రవితేజ (Raviteja) ,భాగ్యశ్రీ బోర్సే,జగపతి బాబు, సచిన్ కెడ్కర్,తనికెళ్ళ భరణి, సత్య తదితరులు..
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: ఆయాంక బోస్
ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి
నిర్మాత: T.G. విశ్వప్రసాద్
దర్శకుడు: హరీష్ శంకర్
విడుదల తేదీ: 15 ఆగస్టు 2024

మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈరోజే విడుదలయ్యింది. కాగా నిన్న ప్రీమియర్స్ పలుచోట్ల వేశారు. బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకులలో మంచి అంచనాలుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పలు అప్డేట్ అందరిని ఎంతో ఆసక్తి పరిచాయి. మరి మాస్ రాజా అభిమానులను ఈ సినిమా ఏ స్థాయిలో అలరించిందో ఈ సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ: ఓ పెద్దింట్లో రైడ్ కి వెళ్లడంతో సస్పెండ్ అవుతాడు ఆనంద్ బచ్చన్ (రవితేజ). సొంత ఊరికి వెళ్లి ఆర్కెస్ట్రా లో పాటలు పడుతూ జిక్కి (భాగ్య శ్రీ బోర్సే) ను ప్రేమిస్తాడు. ఈ విషయం పెద్దలకి తెలిసి పెళ్లి ఖాయం చేస్తారు. అదే సమయంలో సెంట్రల్ నుంచి కరుడుగట్టిన రాజకీయ నాయకుడు ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో రైడ్ చేయాలనీ ఫోన్ కాల్ వస్తుంది. వెంటనే డ్యూటీ లో జాయిన్ అవ్వాలని ఆదేశాలు పంపగా బచ్చన్ ముత్యం జగ్గయ్య ఇంట్లో ఎంత సంపదను పట్టుకున్నాడు. అక్కడ జరిగిన పరిణామాలేంటి అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు: బచ్చన్ గా రవితేజ నటన బాగుంది. కాకపోతే కొత్తదనేం ఏమీ లేదు. ఎప్పుడు కనిపించే రవితేజ నే ఈ సినిమాలోనూ కనిపించదు. అన్ని పాత్రలను ఒకే విధంగా చేయడం రవితేజ ఫ్యాన్స్ ని కూడా నిరాశపరుస్తుంది. కొత్తగా నటిస్తే సినిమా కి ఏమైనా హెల్ప్ అయ్యేదేమో.. ఇక హీరోయిన్ భాగ్యశ్రీ గ్లామర్ షో కి తప్ప పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఆమె పాత్ర నిడివి బాగానే ఉన్నా కథ లో దమ్ము లేకపోవడం ఆమె పాత్ర ఇంట్రెస్ట్ గా అనిపించదు. గ్లామర్ పరంగా మాత్రం భాగ్య శ్రీ సినిమా కు ప్లస్ అనే చెప్పాలి. వీరిద్దరి తర్వాత జగపతిబాబు, సత్య పాత్రల గురించి చెప్పుకోవాలి. విలన్ గా జగపతి బాబు అదరగొట్టాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలకు కేరాఫ్ గా నిలుస్తున్న జగపతి బాబు ఈ సినిమా లో హీరో తో ఢీ అంటే ఢీ అంటూ పోటీపడ్డారు. ఇక సత్య కామెడీ బాగుంది. మొదటి భాగంలో సత్య తనదైన కామెడీతో అలరించే ప్రయత్నం చేశాడు. టిల్లు హీరో సిద్ధార్థ్ జొన్నలగడ్డ క్యామియో పెద్దగా మెరవలేదు. ఒకే ఫైట్ సీన్ లో కనిపించి వెళ్ళిపోయాడు. మిగితా నటీనటులు పర్వాలేదనిపించుకున్నారు.

Also Read: రామ్ పోతినేని, పూరీ జగన్నాధ్ Double Ismart మూవీ రివ్యూ!!

సాంకేతిక నిపుణులు: దర్శకుడు హరీష్ శంకర్ రీమేక్ లను బాగా తీయగలడనే పేరుంది. అది ఈ సినిమా తో పోతుందనే చెప్పాలి. రైడ్ సినిమా కి పూర్తి కాంట్రాస్ట్ గా ఈ సినిమా ని చేశాడు. సీరియస్ సినిమా ను కామెడీ గా తీస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందేమో.. మొదటి భాగంలో ఎక్కువ పాటలు (హిందీ బాలీవుడ్ పాటలను ఉపయోగించడం) ఉపయోగించడం కొంత బోర్ కొట్టించింది. సెకండ్ హాఫ్ కోసం మొదటిభాగాన్ని లాగినట్లు తెలుస్తుంది. లవ్ ట్రాక్ అయితే పెద్దగా ఎవరికి నచ్చలేదు. సినిమాలో హై మూమెంట్స్ కోసం చాలామంది ఎదురుచూశారు. ఎక్కడా ఆ మూమెంట్ తగల్లేదు. అక్కడక్కడా కామెడీ పంచ్ లు తప్పా సినిమా పెద్దగా ఇంట్రెస్ట్ గా తీయలేదు డైరెక్టర్. సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్ :

సత్య కామెడీ

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే లేకపోవడం

ల్యాగ్ అనిపించే రైడ్ సీన్స్

దర్శకత్వం, రవితేజ నటన

తీర్పు: మాస్ ప్రేక్షకులను అలరించడానికి వచ్చిన మిస్టర్ బచ్చన్ క్లాస్ ప్రేక్షకులను కూడా అలరించదు. కొత్తదనం లేని రవితేజ నటన, పాతదనం మరువని హరీష్ శంకర్ డైరెక్షన్, ఎఫెక్టివ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, ల్యాగ్ అనిపించే రైడ్ సీన్స్ వంటివి సినిమా పై బాగా ఎఫెక్ట్ పడుతున్నాయి. మాస్ రాజా అభిమానులకు మాత్రం ఈ సారికూడా నిరాశ తప్పదని చెప్పాలి.

రేటింగ్ : 2/5