Pawan Kalyan Massive Contribution to Flood Relief

Pawan Kalyan: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాలు నీటమునిగిపోగా, వేలాది మంది నిరాశ్రయులై తిండి, తాగునీరు లేక బాధపడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవడానికి ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం అందిస్తున్నారు. తమ సామాజిక బాధ్యతగా భారీగా విరాళాలు ప్రకటిస్తూ, సహాయం చేయడంలో చురుకుగా పాల్గొంటున్నారు.

Pawan Kalyan Massive Contribution to Flood Relief

ఈ నేపథ్యంలో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వరద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించారు. తెలంగాణలోని వరద బాధితులకు కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రికి స్వయంగా అందజేస్తానని తెలిపారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ దాతృత్వం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆపత్కాలంలో పవన్ కళ్యాణ్ అండగా నిలబడడం గొప్ప విషయమని కొనియాడుతున్నారు.

Also Read: Chandrababu: టీడీపీ కీలక ప్రకటన..ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ మొదలు పెట్టిన చంద్రబాబు!!

ఇక ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత దిగజారడంతో, విజయవాడలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలైన 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలను అందజేస్తానని ప్రకటించారు. ఇంతకుముందు హుద్‌హుద్ తుఫాన్ సమయంలోనూ బాధితులకు 50 లక్షల రూపాయలు సాయం చేసినట్లు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా 29 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇంకా ఇద్దరు గల్లంతైనట్లు, పశుసంపద, కోళ్ల నష్టం కూడా భారీగానే జరిగినట్లు వివరించారు. రాష్ట్రంలో 131 వైద్య శిబిరాలు పశువుల చికిత్స కోసం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ వర్షం వల్ల 1,69,000 హెక్టార్ల పంట నష్టపోయిందని, 233 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వరదలు తగ్గిన తర్వాత రోడ్లు, కల్వర్టుల మరమ్మతులు చేపడతామని, ఇంజనీర్లు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పనులు ప్రారంభిస్తారని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన విరాళాలు, ఆయన అందించిన మద్దతు ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు అభినందించారు.