Chhaava Postpone: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ సినిమా పై అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ లో కూడా ‘పుష్ప 2’పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పుష్ప సీక్వెల్ కావడం, దర్శకుడు సుకుమార్ వేరే లెవెల్ లో చేయడం, అల్లు అర్జున్ నటనపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమా యావత్ భారతదేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Chhaava Postpone Release Due to Pushpa 2
డిసెంబర్ 5న ‘పుష్ప 2’ విడుదల కానుండగా, అమెరికాలో డిసెంబర్ 4న ప్రీమియర్లు జరుగనున్నాయి. ఇదే సమయంలో మరొక పాన్-ఇండియా సినిమా కూడా విడుదల తేదీని ఖరారు చేసుకుంది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమా డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. మరాఠా చక్రవర్తి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే, ‘పుష్ప 2’ క్రేజ్ దృష్ట్యా ‘ఛావా’ చిత్ర బృందం తమ సినిమా విడుదల తేదీపై మరోసారి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: Kasthuri: మరోసారి వివాదంలో చిక్కుకున్నసినీ నటి కస్తూరి!!
శంభాజీ మహారాజ్ మహారాష్ట్రలో ఎంతో గౌరవించబడిన చారిత్రక నాయకుడు. అలాంటి గొప్ప నాయకుడి కథను తెరకెక్కించడంలో దర్శకుడు ప్రతాప్ ఫుడ్‌తో పాటు చిత్ర బృందం ఎన్నో అంచనాలు పెట్టుకుంది. కానీ, ‘పుష్ప 2’ క్రేజ్ చూసిన తర్వాత ‘ఛావా’ చిత్ర నిర్మాతలు తమ సినిమా విడుదలను వాయిదా వేయాలా? లేదా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. పాన్-ఇండియా స్థాయిలో విడుదలవుతున్నప్పటికీ, పుష్ప 2 లాంటి భారీ చిత్రంతో పోటీపడటం చాలా సాహసమైన నిర్ణయం అవుతుందని భావిస్తున్నారు.
ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ ప్రభావం ప్రభంజనంలా ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ రెండు చిత్రాలు సమకాలంలో విడుదలైతే ‘ఛావా’కు థియేటర్లు దొరకడంలో సమస్యలు ఎదురవుతాయని, ఆ ప్రభావం వసూళ్లపై తీవ్రంగా పడుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. మరి ‘ఛావా’ విడుదల తేదీ మారుతుందా? లేదా ‘పుష్ప 2’తో పోటికి సిద్ధమవుతుందా? అనేది త్వరలోనే తేలనుంది.