Chandrababu Special Team Formed for Godavari Pushkaralu in AP

Chandrababu: 2027లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగే గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 100 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను తూర్పు గోదావరి జిల్లాలోని అఖండ గోదావరి ప్రాజెక్టు కింద పుష్కరాల ఏర్పాట్లలో వినియోగించనున్నారు. దాదాపు రూ. 100 కోట్ల నిధులు ఘాట్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ, భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించడంలో ఉపయోగపడనున్నాయి.

Chandrababu Special Team Formed for Godavari Pushkaralu in AP

పుష్కరాల నిర్వహణ కోసం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పుష్కరాల ఏర్పాట్లపై సంబంధించి అధికారులకు తక్షణంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ శాఖల అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందం గోదావరి పరివాహక ప్రాంతాలలో పర్యటించి, భక్తుల భద్రత, ఘాట్ల పటిష్టత, రద్దీ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీటి సరఫరా వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించనుంది.

Also Read: Konda Surekha: నాగార్జున విషయంలో కొండా సురేఖ కు చురకలంటించిన కోర్టు.. జైలుకు వెళ్లక తప్పదా?

ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించనుంది. రానున్న రెండు-మూడు నెలల్లో ఈ నివేదిక సిద్ధమవుతుందని భావిస్తున్నారు. గత పుష్కరాలలో ఎదురైన సమస్యలను విశ్లేషించి, వాటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బృందానికి సూచించారు. గంగానది పుష్కరాల నిర్వహణ విధానాన్ని కూడా పరిశీలించి, మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని ప్రతిపాదనలు ఉన్నాయనే విశేషం.

కేంద్రం నుండి నిధులు అందుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తోంది. ఈ పుష్కరాల సందర్భంగా రాష్ట్రానికి పర్యాటకులు అధిక సంఖ్యలో రావడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవనం కలగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇదిలా ఉండగా, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు నిధులు బాగానే వస్తున్నాయి. ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు కూడా కేంద్రం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే.