Chandrababu Naidu: తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు మరోసారి తీపి కబురు అందించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను మరింత విస్తరించనుంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రభుత్వం, వారం రోజుల్లో రెండో జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది. ఈసారి మొదటి జాబితా కంటే రెండో జాబితాలో మరింత స్థాయిలో పోస్టులు ఉంటాయని వార్తలు వినిపిస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో దాదాపు 50 వరకు ఉన్న కులాల కార్పొరేషన్లలో 30-35 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లు నియమించనున్నట్లు తెలుస్తోంది. అదనంగా మరికొన్ని కార్పొరేషన్ పదవులూ కూడా ఖాళీ కావడం, వాటి భర్తీపై చర్చలు జరుగుతుండటం విశేషం.
Chandrababu Naidu to Reward Party Workers
ఇక టీడీపీతో పాటు కూటమిలో భాగస్వాములైన జనసేన, బీజేపీకి కూడా ఈ నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా పార్టీల బలాబలాలను, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని ఈ పదవులను పంపిణీ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నామినేటెడ్ పదవులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో జాబితాను ప్రకటించే యోచనలో ఉన్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: Coconut Oil: ప్రతిరోజు కొబ్బరి నూనె తాగితే.. 100 రోగాలకు చెక్ ?
ఈ పదవుల్లో ఎక్కువ శాతం బీసీ కులాలకు కేటాయించే అవకాశముంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 56 బీసీ కార్పొరేషన్లలో చైర్మన్లతో పాటు ఒక్కో కార్పొరేషన్‌కు 12 మంది సభ్యులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కొన్ని ప్రత్యేక కులాలకు అదనంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్వర్ణకార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం, మరికొన్ని కొత్త కార్పొరేషన్లను ప్రకటించే అవకాశం కూడా ఉంది. కూటమిలో భాగమైన పార్టీ నేతలతో కూడా ఈ విషయంలో సమాలోచనలు జరిపిన తర్వాతే తుది నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
గత ఐదేళ్లలో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీకి సేవలందించిన వారిని గుర్తుంచుకుని వారికి సత్కారంగా ఈ నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. జిల్లాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు పార్టీ శ్రేణుల్లోని ప్రతి స్థాయి నేతలతో చర్చించి, ఆయా పదవులకు ఎవరు అనువైనవారనే విషయాన్ని పరిగణలోకి తీసుకుని జాబితా రూపొందించినట్లు సమాచారం. ఈ పదవుల భర్తీలో ఎలాంటి విమర్శలు రాకుండా, పార్టీకి చేసిన సేవలను, వ్యక్తిగత వివరాలను, సామాజిక వర్గాల సమీకరణాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నియామకాల్లో పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.