Love Reddy Review and Rating

Love Reddy Review: షార్ట్ ఫిల్మ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజన్ రామచంద్రన్ హీరోగా నటించిన సినిమా “లవ్ రెడ్డి”. స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజన్ సరసన శ్రావణి రెడ్డి కథానాయికగా నటించింది. హేమలత రెడ్డి నిర్మించిన ఈ రొమాంటిక్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు అలరించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

Love Reddy Review and Rating

కథ: ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా పెళ్లి కానీ నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్రన్) దివ్య (శ్రావణి రెడ్డి) ని చూసి ప్రేమలో పడతాడు. ఫుడ్ కార్పొరేషన్ లో పనిచేసే దివ్యతో పరిచయం కాస్త ప్రేమదాకా వెళ్తుంది. ఒకరోజు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయగా కొన్ని షరతులు విదిస్తుంది. ఆ షరతులు ఏంటి.. ఈ ఇద్దరి ప్రేమకథకు ముగింపు ఏమిటి? నారాయణ రెడ్డి పేరు లవ్ రెడ్డిగా ఎందుకు మారింది అనే ప్రశ్నలకు సమాధానమే లవ్ రెడ్డి సినిమా కథ.

నటీనటులు: సినిమాలో నటించిన ప్రతిఒక్కరి నటన ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనమయ్యేలా చేస్తూ, భావోద్వేగాలతో ఆకట్టుకున్నారు.హీరో అంజన్ నారాయణ రెడ్డి అలాగే లవ్ రెడ్డి పాత్రలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల అలరించాడు. కొత్త నటుడిగా కనిపించినప్పటికీ, తన పాత్రను కాన్ఫిడెన్స్ తో పోషించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశాడు. శ్రావణి పాత్రలో దివ్య ఆకట్టుకుంది. తన సహజమైన నటనతో ప్రేక్షకుల మనసులను దోచింది. అంజన్, శ్రావణిలు ల కెమిస్ట్రీ, వారి మధ్య పండిన ఫీల్-గుడ్ మూమెంట్స్ సినిమాకు కీలకమైన ఆకర్షణగా నిలిచాయి. దివ్య తండ్రి పాత్రలో ఎన్.టి. రామస్వామి చివర్లో కథకు మరింత బలం చేకూర్చారు. కన్నడ టెలివిజన్ రంగంలో పేరున్న ఆయన, చివరి 20 నిమిషాల్లో చూపిన భావోద్వేగంతో ప్రేక్షకులను కదిలించారు. జ్యోతి మదన్ ఆకట్టుకున్నారు. మొత్తంగా, ప్రతీ నటుడు తమ పాత్రలను పోషించి ఆకట్టుకుని సినిమాను విజయవంతంగా మలిచారు.

సాంకేతిక విభాగం: సున్నితమైన ప్రేమకథను దర్శకుడు స్మరన్ రెడ్డి ఎంతో సహజంగా తెరకెక్కించారు. కథ మొదట్లో వినోదాత్మకంగా సాగినా, క్లైమాక్స్‌కి చేరుకునే కొద్దీ ప్రేక్షకుల హృదయాలను భారంగా మారుస్తుంది. ఈ సినిమాకు సంగీతం ప్రధాన బలం. పాటలు మాత్రమే కాదు, పలు సన్నివేశాలను మరింత ఎమోషనల్‌గా మలచడంలోనూ, కొన్ని సన్నివేశాలను ఉత్తేజపరిచే విధంగా ఎలివేట్ చేయడంలోనూ సంగీత దర్శకుడు ప్రిన్స్ తన ప్రతిభను చూపించాడు. చిక్‌బళ్లాపూర్, తదితర ప్రాంతాల నేటివిటీని కెమెరామెన్ బాగా చూపించారు. కథ, నటీనటుల ఎంపిక చూస్తే నిర్మాతలకు సినిమాపై ఉన్న అభిరుచి స్పష్టంగా తెలుస్తుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ప్రేమ, ఎమోషన్స్, నేటివిటీతో రూపొందిన ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త అనుభూతిని పంచుతుంది.

ప్లస్ పాయింట్స్:

కథ, కథనం

నటీనటుల నటన

పాటలు, నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్:

అక్కడక్కడ బోర్ కొట్టించే సన్నివేశాలు

తీర్పు: మంచి ప్రేమకథా సినిమాలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ రాలేదనే చెప్పాలి. ప్రేక్షకులకు ఆ లోటును లవ్ రెడ్డి తీరుస్తుంది. ప్రేక్షకులను ఫ్రెష్ ఫీలింగ్ ను కలిగిస్తుంది. మంచి పాటలు, నటీనటుల అభినయం సినిమా కు పాజిటివ్ ను తీసుకురావడం ఖాయం. తప్పకుండా ప్రతిఒక్కరు చూడాల్సిన సినిమా.

రేటింగ్: 3.5/5

నటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్‌, ఎన్‌టీ రామస్వామి, గణేశ్‌, పల్లవి తదితరులు
రచన, దర్శకత్వం: స్మరన్‌ రెడ్డి
నిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్
నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి
సంగీతం: ప్రిన్స్‌ హేన్రి
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
విడుదల తేది: అక్టోబర్‌ 18, 2024