Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా వేమవరం వద్ద సరస్వతి పవర్ ప్రాజెక్ట్ను సందర్శించిన పవన్ కళ్యాణ్, ఈ సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కోసం భూములు స్వాధీనం చేసుకునే క్రమంలో రైతులను తీవ్రంగా మోసం చేశారని, ఉద్యోగాలు ఇస్తామని ఆశపెట్టిన తరువాత వారి భూములు లాక్కున్నారని ఆరోపించారు. రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించగా, వారికి పెట్రోల్ బాంబుల బెదిరింపులు ఎదురయ్యాయని, కానీ ఈరోజుకు కూడా వారికి సరైన పరిహారం అందలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan Kalyan Explosive Allegations on Ys Rajashekhar reddy
పవన్ కళ్యాణ్ వైఎస్సార్ హయాంలోని కొన్ని నిర్ణయాలపై అనుమానాలను వ్యక్తం చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వకుండా పవర్ ప్రాజెక్ట్ పేరుతో భూములు స్వాధీనం చేసుకున్నారని, దాంతో అప్పటి రైతులు న్యాయం కోసం పోరాడారని చెప్పారు. అంతేకాకుండా, వైసీపీ ప్రభుత్వం ఎన్ని మోసాలు చేసిందో ప్రజలకు తెలుసు అని, కేవలం 20 లక్షల రూపాయల ఫర్నిచర్ విషయంలోనే కోడెలను వేధించి సమస్యలు సృష్టించిన ప్రభుత్వం పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడంలో వెనుకాడలేదని విమర్శలు గుప్పించారు. దీనితోపాటు దళితుల భూములను కూడా అన్యాయంగా లాక్కుని తమ పేరుపై రాయించుకున్నారని ఆరోపించారు.
Also Read: Savitri: మహానటి సావిత్రి జీవితాన్ని నాశనం చేసిన ఆ రాజకీయ నాయకుడు ఎవరు?
సరస్వతి పవర్ ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూముల్లో అనేక అన్యాయాలు జరిగినట్లు పవన్ కళ్యాణ్ తన పర్యటనలో వివరించారు. అప్పట్లో వైఎస్సార్ ప్రభుత్వం రైతుల నుండి 1,384 ఎకరాలు స్వాధీనం చేసుకోవడంలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని, కానీ వారి భూములు వారికి తిరిగి ఇవ్వకుండా ప్రాజెక్ట్ పనులను నిలిపివేశారని అన్నారు. ఈ భూములకు సంబంధించిన అంశాలపై జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అటవీ భూములను రెవెన్యూ భూములుగా మార్చి 50 ఏళ్లకు లీజు తీసుకున్నారని పవన్ పేర్కొన్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఈ భూములపై గొడవలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పేందుకు ఇదే సాక్షమని పవన్ హితవు పలికారు.
ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ కఠిన వ్యాఖ్యలు చేశారు. పేదల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం, రైతులకు న్యాయం చేయకపోవడం వంటి పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజలు గమనించాలన్నారు. సరస్వతి పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన అన్యాయాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని, అందుకే అధికారులను విచారణకు ఆదేశించామని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.