యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ “రోటి కపడా రొమాన్స్” నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించబడింది. “హుషారు,” “సినిమా చూపిస్త మావ,” “మేం వయసుకు వచ్చాం,” “ప్రేమ ఇష్క్ కాదల్,” “పాగల్” వంటి యూత్‌ఫుల్‌ సినిమాలను నిర్మించిన లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించారు. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకి విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, “నేటి యువతరం, కుటుంబ భావోద్వేగాలను సమన్వయం చేసే యూత్‌ఫుల్ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ ఈ చిత్రానికి ప్రధాన బలాలు. సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన లభిస్తోంది. ప్రివ్యూ ప్రదర్శనలో స్టూడెంట్స్‌, యూత్‌, ఫ్యామిలీ సభ్యులు చూశారు, వారందరికీ సినిమా నచ్చింది. ఇదే ఉత్సాహంతో నవంబర్ 21న ప్రీమియర్స్ ప్లాన్‌ చేశాం,” అని చెప్పారు. ఈటీవీ విన్ డిజిటల్ హక్కులు కొనడం తమ సినిమాకు గుడ్ కంటెంట్ సపోర్ట్‌ను అందించిందని ఆయన వెల్లడించారు.

దర్శకుడు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ, “ఇది యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ, సరికొత్త ఎమోషనల్ రైడ్‌ను అందించే చిత్రం. ప్రతి సన్నివేశంలో ఎమోషనల్ డెప్త్ ఉంది. ఫ్యామిలీ, యూత్ అంశాలను సమన్వయం చేసి యూనిక్ కథతో ఈ చిత్రం తీశాం. ప్రేక్షకులు నవంబర్ 22న థియేటర్లలో కొత్త విజువల్స్, కొత్త కథను ఆస్వాదిస్తారు. ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. సినిమా చూసిన తర్వాత కూడా ఆ పాత్రలు వారిని వెంటాడతాయి,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హీరోలు హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, హీరోయిన్స్ సోను ఠాకూర్, మేఘలేఖ, కెమెరామెన్ సంతోష్ రెడ్డి, సంగీత దర్శకుడు ఆర్‌.ఆర్‌. ధ్రువన్, నిర్మాత సృజన్ బొజ్జం తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో సపోర్టింగ్ కాస్ట్‌లో రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి నటించారు.

సాంకేతిక విభాగంలో కాస్ట్యూమ్ డిజైనర్లు అశ్వంత్ భైరి, ప్రతిభా రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, డీవోపీ సంతోష్ రెడ్డి, ఎడిటర్ విజయ్ వర్థన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పి.భరత్ రెడ్డి ఉన్నారు.