Teja Sajja Suffers Minor Injury While Filming 'Mirai'

Teja Sajja: టాలీవుడ్‌లో విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న నటుడు తేజ సజ్జా. బాల నటుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన తేజ, హీరోగా మారిన తర్వాత కూడా ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ‘జాంబి రెడ్డి’, ‘ఇష్క్’ వంటి సినిమాలతో మంచి పేరు పొందిన తేజ, ఇటీవల ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు.

Teja Sajja Suffers Minor Injury While Filming ‘Mirai’

ప్రస్తుతం, తేజ సజ్జా ‘మిరాయ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. ఇందులో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ‘మిరాయ్’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల శ్రీలంకలో కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

Also Read: Sandeep Reddy Vanga: హీరోలకు కండిషన్స్ పెట్టడంలో జక్కన్న ను మించిపోయిన సందీప్ వంగ!!

ఈ షూటింగ్ సమయంలో తేజ సజ్జా డూప్ లేకుండా స్వయంగా నటిస్తూ చిన్నపాటి గాయానికి గురయ్యాడు. శ్రీలంక షెడ్యూల్ ముగించుకుని హైదరాబాద్ వచ్చిన తేజ, ఎయిర్‌పోర్టులో ఎడమ చేతికి కట్టుతో కనిపించాడు, దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. అయితే, గాయం తీవ్రంగా లేకపోవడంతో వైద్యులు ఆయనకు రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు తెలిసింది. త్వరలోనే తేజ మరో షెడ్యూల్‌లో పాల్గొంటాడని సమాచారం.

‘మిరాయ్’ సినిమాను 8 భాషల్లో విడుదల చేయనున్నారని తెలిపారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, జపనీస్ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 18న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజకు పెద్దగా ఏమీ కాకపోవడంతో, ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సినిమా తేజ సజ్జా కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.