సినిమా : వీక్షణం (Veekshanam)
విడుదల తేదీ : 18 అక్టోబర్ 2024
నటీనటులు : రామ్ కార్తీక్, కశ్వి, చిత్రం శ్రీను, నక్షత్ర నైనా.. తదితరులు
దర్శకత్వం: మనోజ్ పల్లేటి
సంగీతం: సమర్ద్ గొల్లపూడి
సినిమాటోగ్రఫీ: సాయి రామ్ ఉదయ్
ఎడిటింగ్: జెస్విన్ ప్రభు
నిర్మాతలు: పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి
Veekshanam Movie Review And Rating
రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన “వీక్షణం” సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. పద్మనాభ సినీ ఆర్ట్స్ పతాకంపై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి మనోజ్ పల్లేటి దర్శకత్వం వహించారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని టీజర్, ట్రైలర్‌తోనే అంచనాలు పెంచారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకుందాం.
కథ: హైదరాబాదులో ఒక గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉండే అర్విన్ (రామ్ కార్తిక్)కు బైనాకులర్స్ తో తన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ ఇళ్ళలో ఏం జరుగుతుందో తెలుసుకునే అలవాటు ఉంటుంది. తన స్నేహితుడితో కలిసి అలా చూస్తున్న సమయంలోనే అతనికి నేహ(కశ్వి ) మీద ప్రేమ పుడుతుంది. ఆమెను ప్రేమలో పడేసేందుకు తన స్నేహితుడి సహాయంతో అనేక ప్రయత్నాలు చేయగా చివరికి ఆ ప్రయత్నాలు ఫలించి ఆమె ప్రేమలో పడుతుంది. ఆమెతో గొడవ అయిన సమయంలో మరో ఇంటిని అలాగే పరిశీలిస్తుండగా ఒక అమ్మాయి రోజుకు ఒక వ్యక్తిని ఇంటికి తీసుకురావడం గమనిస్తాడు. ముందు పెద్దగా సీరియస్గా తీసుకోడు కానీ ఆ అమ్మాయి ఏదో పెద్ద క్రైమ్ చేస్తుందని భావించి ఆమె మీద ఫోకస్ చేస్తాడు. ఆ తర్వాత ఆమె హత్యలు చేస్తుందని తెలిసి ఆమెను ట్రేస్ చేసే ప్రయత్నం చేయగా ఆమె చనిపోయి ఎనిమిది నెలలు అయిందని తెలుస్తుంది. అయితే చనిపోయి ఎనిమిది నెలలు అయిన అమ్మాయి ఎలా హత్యలు చేస్తుంది? ఆర్విన్ తన స్నేహితుడు ఛీ ఛీ, బావమరిది(షైనింగ్ ఫణి)తో కలిసి చూసింది నిజమేనా? అసలు ఆ హత్యలు చేసేది ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నారు? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు: నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. హీరో రామ్ కార్తీక్ పక్కింటి విషయాలపై ఆసక్తి చూపించే సాధారణ యువకుడిగా పాత్రలో ఒదిగిపోయి, సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కశ్వి గ్లామర్ మాత్రమే కాకుండా తన అభినయంతో కూడా మెప్పించింది. బాలనటిగా నిరూపించుకున్న తన ప్రతిభను ఈ సినిమాలోనూ బాగా చూపించింది. చనిపోయిన అమ్మాయిగా కీలక పాత్రలో నటించిన బిందు నూతక్కి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కదిలించింది. షైనింగ్ ఫణి తన కామెడీ టైమింగ్‌తో మంచి నవ్వులు పూయించాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు సమర్థవంతంగా నటించారు.
సాంకేతికనిపుణులు: “వీక్షణం” సినిమాను టెక్నికల్‌గా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో సంగీత దర్శకుడు సమర్థ్ గొల్లపూడి కీలక పాత్ర పోషించారు. థ్రిల్లర్ సినిమాలకు బలంగా నిలిచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అద్భుతంగా సమకూర్చి, సినిమాను మరింత ఆసక్తికరంగా మలిచారు. సిద్ శ్రీరామ్ పాడిన “ఎన్నెన్నెన్నో” పాటతో పాటు, “వీక్షణ”లోని ఇతర పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తన రెండవ చిత్రానికే సమర్థ్ గొల్లపూడి సంగీతంలో ఉన్న పరిపక్వత స్పష్టంగా కనిపించింది. రామ్ కార్తీక్ ఈ సినిమాకు హీరో అయినా, టెక్నికల్‌గా మాత్రం సమర్థ్ గొల్లపూడి నిజమైన హీరో అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమా మూడ్‌ను అద్భుతంగా ప్రతిబింబించింది. ముఖ్యంగా థ్రిల్లింగ్ సన్నివేశాల చిత్రీకరణలో కెమెరామెన్ ప్రతిభ గోచరించింది. ఫైట్స్ కూడా సృజనాత్మకంగా డిజైన్ చేయబడ్డాయి. నిర్మాణ విలువలు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయి.
విశ్లేషణ: “ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని మన పని మనం చూసుకోవడం” అన్న విక్టరీ వెంకటేష్ మాటలే ఈ సినిమాకు ప్రేరణగా మారాయని దర్శకుడు మనోజ్ తెలిపారు. ఆ మాటకు అనుగుణంగా, ఇతరుల జీవితాల్లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి కారణంగా హీరో ఎదుర్కొనే సమస్యలను, వాటిని అధిగమించే ప్రయత్నాన్ని దర్శకుడు చాలా సుకుమారంగా చిత్రీకరించారు. ఇక సెకండ్ హాఫ్‌లో చనిపోయిన ఆ అమ్మాయి హత్యల వెనుక ఉన్న రహస్యాన్ని కనుగొనే ప్రయత్నం ఆసక్తికరంగా సాగుతుంది. క్లైమాక్స్ కూడా పరిపాటీకి భిన్నంగా, రెండవ భాగానికి లీడ్ ఇచ్చే విధంగా ఉంటుంది. మొదటి సినిమా అయినప్పటికీ, దర్శకుడు ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను తీర్చిదిద్దడం అభినందనీయం. సమాజంలో ఉన్న ఒక సమస్యను స్పృశిస్తూనే క్లిష్టమైన కథనాన్ని సున్నితంగా చెప్పడంలో ఆయన విజయం సాధించారు.
తీర్పు: ప్రతి సన్నివేశంలో సస్పెన్స్‌ను చక్కగా కొనసాగిస్తూ, కథను ప్రేక్షకుల ఊహకు అందకుండా నడిపించారు దర్శకుడు. ఫస్ట్ హాఫ్‌లో హీరో-హీరోయిన్ మధ్య ప్రేమ, వారి గొడవలు, అలాగే మరో అమ్మాయి హత్యను చూడటం వంటి పరిణామాలు ఇంటర్వెల్ బ్లాక్‌ను ఉత్కంఠగా ముగిస్తాయి. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారు తప్పకుండ చూడాల్సిన సినిమా ఇది.
రేటింగ్:3.5/5