Venom The Last Dance Review and Rating

Venom: The Last Dance: మాన్‌స్టర్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అపూర్వమైన క్రేజ్ ఉంటుంది. ఈ చిత్రాలను ఫ్రాంచైజ్‌లుగా చేసి ఒక్కో భాగాన్ని వరుసగా ప్రేక్షకులకు అందిస్తూ వస్తుంటారు నిర్మాతలు. హాలీవుడ్‌లో అలాంటి ప్రసిద్ధ మాన్‌స్టర్ చిత్రాల్లో ‘వెనొమ్’ ఒకటి. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్‌లో విడుదలైన రెండు సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి మూడవ చిత్రం ‘వెనొమ్: ది లాస్ట్ డ్యాన్స్’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

Venom: The Last Dance Review and Rating

కథ: రెండో పార్ట్ తర్వాత ఎడ్డీ (టామ్ హార్డీ) మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారతాడు. అతనికోసం ఓ వైపు పోలీసులు వెతుకుతుంటే ఇంకోవైపు వెనోమ్ కోసం తన గ్రహ వాసులు వెతుకుతుంటారు. దాంతో ఒక్కచోట ఉండకుండా పారిపోతూనే ఉంటారు. ప్రపంచాన్ని నాశనం చేయాలనే కోరికతో నల్ (ఆండీ సెర్కిస్) కూడా వీరిదగ్గర ఉన్న ఓ ఎలిమెంట్ కోసం తన అనుచరులతో వెతికిస్తుంటాడు. ఆ ఎలిమెంట్ ప్రపంచంలో వీరి దగ్గర మాత్రమే ఉంటుంది. ఇది నల్ కి దక్కకుండా ఉండాలంటే ఎడ్డీ, వెనోమ్ లలో ఎవరో ఒకరు చనిపోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం అంతం అవకుండా వారేం చేశారు. ఎవరు తమ ప్రాణాలను పణంగా పెట్టుకున్నారు. అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: సూపర్ హీరో సినిమాలంటేనే యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదు. “వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్” కూడా ఈ విషయంలో మనల్ని నిరాశపరచదు. మొదటి నుంచి చివరి వరకు మూడు ప్రధాన యాక్షన్ బ్లాక్‌లు ఉత్కంఠభరితంగా సాగుతాయి. ముఖ్యంగా 20 నిమిషాల నిడివి గల క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్, వెనమ్, ఇతర సింబియోట్స్ మరియు మిలటరీ కలిసి ప్రధాన విలన్‌తో చేసే యుద్ధం, ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తుంది.

అయితే, ఒక సూపర్ హీరోకి వీడ్కోలు పలుకుతున్నప్పుడు, భావోద్వేగాలు కూడా అంతే బలంగా ఉండాలి. ఈ విషయంలో “లోగన్”, “అవెంజర్స్: ఎండ్ గేమ్”, “గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3” వంటి సినిమాలు ఒక ప్రమాణంగా నిలిచాయి. “వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్”లో ఈ భావోద్వేగ బలం వాటికీ ఏమాత్రం మించిపోలేదు. ముఖ్యంగా ఎడ్డీ, వెనమ్ మధ్య హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ప్రేక్షకులకు నచ్చుతాయి. క్లైమాక్స్‌లో ఒక సన్నివేశం మాత్రమే అందరి హృదయాలను టచ్ చేస్తుంది. నల్-వెనమ్ మధ్య సన్నివేశాలు లేకపోవడం నిరాశపరుస్తాయి, నల్ పాత్ర చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది.

టెక్నికల్‌గా సినిమా అద్భుతంగా ఉంది. వీఎఫ్ఎక్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. డాన్ డీకన్ నేపథ్య సంగీతం బాగుంది. నటీనటుల నటన విషయానికి వస్తే, టామ్ హార్డీ తన అద్భుతమైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎడ్డీ బ్రాక్ మరియు వెనమ్ పాత్రల మధ్య తారతమ్యాన్ని అద్భుతంగా చూపించాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా చక్కగా ఉంది. మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్ గా…. సూపర్ హీరో సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా చక్కని వినోదాన్ని అందిస్తుంది.

రేటింగ్: 3/5