Pawan Kalyan Slams Jagan: ప్రతిపక్ష హోదా వైసీపీకి రాదని పవన్ స్పష్టం.. ఏపీ రాజకీయాల్లో మళ్లీ వేడి పెంచిన పవన్ వ్యాఖ్యలు!!

Pawan Kalyan Slams Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ నేతృత్వంలోని వైసీపీకి వచ్చే ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని, వైసీపీకి ఆ అర్హత లేదని పేర్కొన్నారు. “జగన్ గారు గుర్తుంచుకోండి.. 11 సీట్లు గెలిచిన మీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? జనసేన కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా అది సాధ్యం కాదు” అంటూ పవన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
Pawan Kalyan Slams Jagan Over Opposition Status
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, వైసీపీ సభ్యులు ప్రతిపక్ష హోదా కోరుతున్నారని, అయితే రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని పవన్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా తమకు రావాలంటే నిబంధనల ప్రకారం ముందుకు రావాలని సూచించారు. “ప్రజలు ఇచ్చిన 11 సీట్లను గౌరవించి అసెంబ్లీలో పాల్గొనాలి. ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన ప్రమాణాలు ఉండాలి” అని పవన్ అన్నారు. ఓట్ల శాతాన్ని బట్టి జగన్‌కు జర్మనీ వెళ్లాల్సిందేనంటూ వ్యంగ్యంగా విమర్శించారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. “పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే గోవాకు వెళ్లాల్సిందే” అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. గోవాలో 40 అసెంబ్లీ స్థానాలు ఉండగా, 21 సీట్లు మెజారిటీకి అవసరం. జనసేన 21 స్థానాలు గెలుచుకున్నా, ఏపీలో పవన్ సీఎం అయ్యే పరిస్థితి లేదని అంబటి ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
ఈ విమర్శలు సోషల్ మీడియాలో వేడివేడి చర్చకు దారితీశాయి. జనసేన, వైసీపీ మద్దతుదారుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయంగా మరోసారి వైసీపీ-జనసేన మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.