Revanth Reddy: పట్టభద్రుల సంక్షేమంపై కాంగ్రెస్ కార్యాచరణ.. రేవంత్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ నేతల ఉత్సాహం!!

Revanth Reddy: తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్స్‌లో సోమవారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సంకల్ప సభ ఘనంగా విజయవంతమైంది. సభకు పెద్ద సంఖ్యలో పట్టభద్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్ జిల్లాకు వచ్చిన రేవంత్ రెడ్డికి పార్టీ శ్రేణులు గౌరవప్రదంగా స్వాగతం పలికాయి. సభా వేదికపై కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగానికి విశేష స్పందన లభించింది.
Revanth Reddy Speech in Karimnagar
సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ పాత్రను గుర్తుచేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేసిన సహాయాన్ని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి దేశానికి సేవలందించిన దివంగత నేతలు పీవీ నరసింహారావు, గడ్డం వెంకటస్వామి (కాకా), చొక్కారావు, ఎమ్మెస్సార్ లాంటి నేతల సేవలను స్మరించుకున్నారు. సభా ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది. సభ ముగిసే వరకు ప్రజలు ఉత్సాహంగా ఉండటం విశేషం.
ఈ సభలో కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, వివిధ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వెంకటేశ్వర స్వామి విగ్రహంతో కూడిన జ్ఞాపికను అందజేశారు.
నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, “30 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నేనున్నాను. ట్యూషన్ సెంటర్ నుంచి ఈ స్థాయికి ఎదిగాను. మిగిలిన అభ్యర్థులు కరీంనగర్‌లో పెట్టుబడి పెట్టలేదు, ఉపాధి కల్పించలేదు. కానీ నా అల్ఫోర్స్ విద్యాసంస్థల ద్వారా 10 వేల మందికి ఉపాధి కల్పించాను. పట్టభద్రుల అభివృద్ధి కోసం, నిరుద్యోగులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించాను” అని చెప్పారు. ఆయన పట్టభద్రుల కోసం తన ప్రణాళికలను వివరించారు.