New Zealand Bowler: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్ కు షాక్.. కీలక బౌలర్ కి గాయం!!

New Zealand Bowler: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ ముందు న్యూజిలాండ్ కు భారీ షాక్ తగిలింది. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్టార్ పేసర్ మ్యాట్ హెన్రీ గాయపడడంతో, భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌కు అతడి అందుబాటు అనుమానంగా మారింది.
New Zealand Bowler Injured Before India Clash
దక్షిణాఫ్రికా తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో, హెన్రిచ్ క్లాసెన్ షాట్‌ను అందుకునే క్రమంలో హెన్రీ భుజానికి గాయం తగిలింది. దీనివల్ల అతను మైదానాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది. అతడి గాయంపై న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్ స్పందిస్తూ, “ఫైనల్‌కు ఇంకా సమయం ఉంది, హెన్రీ పూర్తిగా కోలుకోవాలని ఆశిస్తున్నాం” అని అన్నారు. అయితే, అతడు పూర్తిగా కోలుకోవడం కష్టం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటివరకు మ్యాట్ హెన్రీ టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. లీగ్ స్టేజీలో భారత్‌పై 5 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఫైనల్ కు అతడు అందుబాటులో లేకపోతే, ఫాస్ట్ బౌలర్ జాకబ్ డఫీ అతని స్థానంలో తుది జట్టులోకి రావచ్చు.
భారత్ – న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ వేదికగా జరగనుంది. న్యూజిలాండ్ జట్టు: మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, విల్ యంగ్, విలియమ్సన్, డేరిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, నాథన్ స్మిత్, టామ్ లేథమ్, విలియమ్ ఒరుర్కే, మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, కైల్ జెమీసన్.
