Bachhala Malli Review: అల్లరి నరేష్ ‘బచ్చల మల్లి’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!
మూవీ : Bachhala Malli Review
నటీనటులు: అల్లరి నరేష్-అమృత అయ్యర్-రావు రమేష్-రోహిణి-హరిప్రియ-జయరాం-హర్ష చెముడు-ప్రసాద్ బెహరా-ప్రవీణ్-అచ్యుత్ కుమార్-అంకిత్ కొయ్య తదితరులు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఛాయాగ్రహణం: రిచర్డ్ ఎం.నాథన్
స్క్రీన్ ప్లే: విప్పర్తి మధు
నిర్మాతలు: రాజేష్ దండ-బాలాజి గుట్ట
కథ-మాటలు-దర్శకత్వం: సుబ్బు మంగాదేవి
Bachhala Malli Review and Rating
అల్లరి నరేష్ కామెడీ హీరోగా మనందరికీ పరిచయమే. కానీ, ‘నాంది’ లాంటి సినిమాలతో సీరియస్ రోల్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ‘బచ్చల మల్లి’తో మరోసారి విభిన్న పాత్రను చేశాడు. ఈ సినిమాలో అతను ఒక గ్రామీణ యువకుడిగా కనిపించాడు. అతని నటన ఎలా ఉంది? ఈ సినిమా ఆడియన్స్‌ను అలరించిందా? అనేది ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ: బచ్చలమల్లి (నరేష్) తనకు తండ్రి అంటే చాలా ఇష్టం. ఇక తండ్రికి కూడా కొడుకులంటే ప్రేమ. అయితే రెండో పెళ్లి చేసుకుని తల్లికి అన్యాయం చేశాడనే కోపంతో తండ్రిపై కోపాన్ని పెంచేసుకుంటాడు మల్లీ. ఆ కోపం పగగా మారడం.. ఈ క్రమంలోనే చదువు మానేసి.. లైఫ్ స్పాయిల్ చేసుకోవడం.. మద్యం, పొగ తాగడం ఇతరేతర చెడు అలవాట్లన్నీ అలవర్చుకుంటాడు. లేని చెడు అలవాటు ఉండదు. అన్నింటికీ మించి లిమిట్స్ లేని మూర్ఖత్వం. ఇలాంటి క్రమంలో మల్లీ.. కావేరి (అమృత అయ్యర్)ని ప్రేమిస్తాడు. తన కోసం చెడు అలవాట్లు మార్చుకొని జీవితాన్ని చక్కగా మలుచుకుంటున్నాడు అనుకునే టైంలో మళ్లీ మూర్ఖత్వం మొదలైంది. దానికి కారణం ఏంటి.. మల్లీ మరోసారి తప్పుడు దారి పట్టడా.. అసలు మళ్లీ జీవితం చేజేతులారా ఎలా నాశనం చేసుకున్నాడు.. అనేది అసలు కథ.
నటీనటులు: అల్లరి నరేష్ తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘బచ్చల మల్లి’ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఆకట్టుకోవడం విశేషం. నరేష్ తన పాత్రకు ప్రాణం పోశారనే చెప్పాలి. గ్రామీణ యువకుడి పాత్రలో చాలా సహజంగా కనిపించారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. పాత్రకు తగినట్లు మేకప్ లేకపోవడం కొంత అసహజంగా అనిపించింది. ఇక అమృత అయ్యర్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్, బలగం జయరామ్, కన్నడ నటుడు అచ్యుత్ కుమార్ తమ పరిధుల మేరకు నటించారు. కమెడియన్లు ప్రవీణ్, హరితేజలు కూడా తమ పాత్రలకు జీవం పోశారు. ముఖ్యంగా ప్రవీణ్ కొత్త తరహా పాత్రలో తనదైన శైలిలో మెప్పించారు. వైవా హర్ష తనదైన శైలిలో వినోదాన్ని పంచే ప్రయత్నం చేశారు.
సాంకేతిక నిపుణులు: దర్శకుడు చేసిన ప్రయత్నం అభినందనీయమని చెప్పాలి. కథలో మల్లి పాత్ర ద్వారా కోపం, మూర్ఖత్వం వంటి భావనలతో ఏమీ సాధించలేమని, పట్టు విడుపులు అవసరమని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందేశాన్ని దర్శకుడు విజయవంతంగా అందించగలిగారు. స్క్రీన్ ప్లే కట్టుదిట్టంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ ముఖ్యంగా మెచ్చుకోదగినది, పీరియాడిక్ థీమ్ కోసం ఊర్లలో షూటింగ్ చేసిన కృషి స్పష్టంగా కనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోశాయి, పాటల కట్టే వినసొంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా మొత్తాన్ని క్వాలిటీ గా నిలబెట్టాయి. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సినిమా తీశారనే అనుభూతి ప్రేక్షకులకు అవుతుంది.
బలాబలాలు: ‘బచ్చల మల్లి’ సినిమా అల్లరి నరేష్ కొత్త ప్రయత్నం. దర్శకుడు సుబ్బు మంగాదేవి తన కథతో ప్రభావవంతమైన సందేశం ఇవ్వాలనుకున్నప్పటికీ, ఎగ్జిక్యూషన్‌లో కొంత కొరత అనిపించింది. కథా పరిచయంలో కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎపిసోడ్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, పూర్తి సినిమాను ఆసక్తికరంగా నడిపించడంలో విఫలమయ్యారు. ప్రి క్లైమాక్స్ నుంచి సినిమా పుంజుకోగా, ముగింపు అదిరిపోయింది. ‘బచ్చల మల్లి’ ముఖ్యంగా అల్లరి నరేష్ నటనతో నిలిచిన సినిమా. మరింత బలమైన కథా నిర్మాణం తో ఇది మరింత ప్రభావవంతంగా ఆకట్టుకుంది.
మొత్తంగా చూస్తే, ‘బచ్చల మల్లి’ అల్లరి నరేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుంది. ఆయన నటన, కథాంశం, కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, మేకప్‌లోని కొన్ని లోపాలు మరియు కొన్ని సన్నివేశాలలో స్క్రీన్‌ప్లేలో కొంత బలహీనత కనిపించాయి. అయినప్పటికీ, అల్లరి నరేష్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సఫలమయ్యారు.
రేటింగ్: 3/5