Kohli: టీమ్ ఇండియాలో సీనియర్ల వివాదం.. గంభీర్, అగార్కర్ల వైఖరిపై కోహ్లీ అసంతృప్తి?

Kohli: వన్డే క్రికెట్‌లో టీమ్ ఇండియా రథసారథి, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) ఆడటంపై ఎట్టకేలకు తన నోరు విప్పారు. ఇటీవల టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో కోహ్లీ, రోహిత్ ల ఫ్యూచర్ ప్లాన్స్ గురించి మాట్లాడుతూ.. “2027 వరల్డ్ కప్ లభ్యత గురించి వారినే అడగాలి” అని దాటవేస్తూ వస్తున్నారు. దీనిపై తాజాగా జరిగిన ఆర్సీబీ పాడ్‌కాస్ట్‌లో కోహ్లీ అత్యంత ఘాటుగా, స్పష్టంగా స్పందించారు.

Kohli Strong Message To Gambhir Agarkar

కోహ్లీ మాట్లాడుతూ.. “నేను 2027 వరల్డ్ కప్ ఆడాలని అనుకుంటున్నాను. అందుకోసమే కష్టపడుతున్నాను. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత ముఖ్యం. నేను జట్టుకు ఉపయోగపడతానని మేనేజ్‌మెంట్ నమ్మితే ఆడటానికి ఎప్పుడూ సిద్ధమే. నేను మైదానంలోకి వస్తే నా వంద శాతం శ్రమను పెడతాను, ఒక వన్డే మ్యాచ్‌లో 40 ఓవర్ల పాటు పరిగెత్తమన్నా నేను వెనకాడను, ఎందుకంటే దానికి నా శరీరం సహకరిస్తుంది. కానీ, ఇన్నేళ్ల క్రికెట్ తర్వాత కూడా నేను జట్టులో ఉండటానికి ప్రతి సిరీస్ లోనూ నన్ను నేను నిరూపించుకోవాలని (Prove my worth) ఒత్తిడి తెస్తే, ఆ స్థానంలో నేను ఉండలేను. నేను ఎవరికో ఏదో నిరూపించడానికి క్రికెట్ ఆడటం లేదు, ఆటపై ఉన్న ప్రేమతోనే ఆడుతున్నాను” అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు నేరుగా గౌతమ్ గంభీర్ మరియు సెలెక్షన్ కమిటీని ఉద్దేశించి చేసినవేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం టెస్టులు, టీ20ల నుండి తప్పుకుని కేవలం వన్డేలు, ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న కోహ్లీ, తన ఫిట్‌నెస్ మరియు డైట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2026లో కూడా ఆయన అద్భుతమైన సెంచరీలతో ఆరెంజ్ క్యాప్ రేసులో దూసుకుపోతున్నారు.

క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లాగా 100 సెంచరీల మైలురాయిని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న కోహ్లీని 2027 సౌతాఫ్రికా వరల్డ్ కప్‌లో చూడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, మేనేజ్‌మెంట్ మరియు కోహ్లీ మధ్య ఉన్న ఈ సైలెంట్ వార్ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.