Fateh trailer: కిల్,మార్కో తరహాలో ‘ఫతే’.. సోనూ సూద్ పల్స్ పట్టేశాడు!!
Fateh trailer: తెలుగు ప్రేక్షకులకు సోనూ సూద్ అంటే కొత్తగా పరిచయం అవసరం లేదు. ఆయన నటించిన విలన్ పాత్రలు ప్రేక్షకుల మదిలో ప్రత్యేకస్థానాన్ని సంపాదించాయి. అయితే కరోనా మహమ్మారి సమయంలో ఆయన చేసిన మానవ సేవ తెలుగువారితో పాటు దేశ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేసింది. లాక్‌డౌన్ సమయంలో వేలాదిమందికి ఆహారం, వసతి, రవాణా సౌకర్యాలను కల్పించి, లక్షలాది మందికి ఆశాకిరణంగా నిలిచారు. ఈ మహత్తరమైన సేవల కారణంగా ఆయనకు విలన్ అని కాకుండా రియల్ హీరోగా ప్రేక్షకుల గుండెల్లో స్థానం లభించింది.
Sonu Sood Fateh trailer trends online
సోనూ సూద్ నిజ జీవితంలో ఇంతటి స్ఫూర్తిదాయకమైన సేవలు చేయడంతో, అభిమానులు ఆయనను సినిమాల్లో కూడా హీరోగా చూడాలనే ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ కోరికను నెరవేర్చేందుకు సోనూ తన స్వయంగా దర్శకత్వం వహించిన ‘ఫతే’ అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై, అందరినీ ఆకట్టుకుంది. ట్రైలర్‌లో ఆయన ప్రదర్శించిన హింసాత్మక యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ట్రైలర్‌లోని విజువల్స్, కత్తులు, తుపాకులతో సోనూ సృష్టించిన వీరవిధ్వంసం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తోంది.
‘ఫతే’ చిత్రంలో సోనూ సూద్ కథానాయకుడిగా మాత్రమే కాకుండా, కథనాయకుడి ప్రయాణాన్ని సున్నితంగా చెప్పగలిగే దర్శకుడిగానూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ చిత్ర కథ సైబర్ క్రైమ్ సిండికేట్ చేతిలో చిక్కుకున్న ఒక అమ్మాయిని రక్షించేందుకు ఓ మాజీ పోలీస్ ఆఫీసర్ (సోనూ సూద్) చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. కథ, పాత్ర రూపకల్పన చూసి ఈ సినిమాను జేమ్స్ బాండ్ తరహా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్‌గా భావించవచ్చు. సోనూ సూద్ యాక్షన్ సీన్స్, కథనంతో కూడిన ప్రదర్శన ప్రేక్షకుల మెప్పిస్తుందని చెప్పవచ్చు.
ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నటుడు మహేశ్ బాబు విడుదల చేయడం ప్రత్యేక ఆకర్షణ. సోనూ సూద్, మహేశ్ బాబు మధ్య ఉన్న స్నేహం కారణంగా మహేశ్ బాబు ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. మహేశ్ బాబు ట్రైలర్ చూసి సోనూ సూద్‌ను అభినందించడమే కాకుండా, సినిమాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటనతో చిత్రంపై మరింత హైప్ పెరిగింది. ‘ఫతే’ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుండగా, సోనూ సూద్ విలన్ పాత్రల నుంచి యాక్షన్ హీరోగా మారిన ఈ ప్రయోగం ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశముంది.