ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మళ్లీ గుజరాత్ టైటాన్స్ గూటికి చేరే ప్రయత్నం చేశాడట. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. హార్దిక్ తిరుగుబాటు నిర్ణయం తీసుకున్నా, అతడి షరతులే అడ్డంకిగా మారాయని తెలుస్తోంది. గతంలో గుజరాత్‌ను టైటిల్ వరకు తీసుకెళ్లిన హార్దిక్, మళ్లీ ఆ జట్టులోకి వెళ్లేందుకు సిద్ధమయ్యాడట.
అయితే, హార్దిక్ పాండ్యా తన రాకకు ఓ భారీ షరతు పెట్టాడు. గుజరాత్ టైటాన్స్ తిరిగి తనకే కెప్టెన్సీ అప్పగించాలని డిమాండ్ చేశాడట. ప్రస్తుతం గుజరాత్ సారథ్యం బాధ్యతలు శుభ్‌మన్ గిల్ చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హార్దిక్ కెప్టెన్సీ షరతు పెట్టడంతో గుజరాత్ యాజమాన్యం షాక్ తిన్నట్లు సమాచారం. గిల్ నాయకత్వంలో జట్టు మంచి ప్రదర్శన కనబరుస్తుండటంతో, హార్దిక్ డిమాండ్‌కు వారు తలొంచలేదని అర్థమవుతోంది.
దీంతో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ రీ-ఎంట్రీ ప్రతిపాదనకు బ్రేక్ పడినట్లే. హార్దిక్ మళ్లీ గుజరాత్‌కు వస్తాడనే ఊహాగానాలు ఇంతటితో ముగిశాయి. ఇక ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్సీ కోసం హార్దిక్ పెట్టిన ఈ షరతు ఐపీఎల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. గిల్-హార్దిక్ మధ్య సారథ్యం విషయంలో ఇది కొత్త వివాదానికి దారితీస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది.





