భారత జెర్సీలపై పాకిస్తాన్ పేరు.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అలా!!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభంకానుంది. ఈసారి టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనుండగా, మ్యాచ్‌లు పాకిస్తాన్ మరియు దుబాయ్‌లలో జరగనున్నాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం, హోస్ట్ దేశం పేరును పాల్గొనే అన్ని జట్ల జెర్సీలపై ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో, భారత జెర్సీలపై “పాకిస్తాన్” పేరు కనిపించాల్సి వస్తుంది.
ప్రారంభంలో బీసీసీఐ దీనికి వ్యతిరేకంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత జెర్సీలపై పాకిస్తాన్ పేరు ఉండకూడదని స్పష్టం చేసింది. అయితే, ఐసీసీ దీనిపై కఠినమైన వైఖరి తీసుకుంది. టోర్నమెంట్ హోస్ట్ దేశం పేరును జెర్సీలపై ప్రదర్శించడం ప్రామాణిక నిబంధన అని స్పష్టం చేసింది. ఈ నిబంధనకు ఎలాంటి మినహాయింపులు లేవని, అందరూ దీనిని పాటించాల్సిందేనని ఐసీసీ వెల్లడించింది.
ఐసీసీ కఠిన నిర్ణయంతో బీసీసీఐ తన వైఖరిని మార్చుకుంది. భారత జట్టు ఐసీసీ నిబంధనలను గౌరవిస్తూ, తప్పనిసరిగా జెర్సీలను ధరిస్తుందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. “మేము ఐసీసీ నియమాలను పాటిస్తాం, వారి నిర్ణయాలను గౌరవిస్తాం” అని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో, భారత జట్టు భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్లో మ్యాచ్‌లు ఆడేందుకు నిరాకరించింది. దీంతో, భారత్ పోటీలను దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. హైబ్రిడ్ మోడల్ టోర్నమెంట్ వల్ల లాజిస్టికల్ సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, భారత జట్టు బాగస్వామ్యాన్ని నిర్ధారించేందుకే ఈ మార్గాన్ని ఐసీసీ ఎంచుకుంది.