Ragging incident: దారుణమైన ర్యాగింగ్.. చులకనగా చూస్తూ.. బాత్రూం టాయిలెట్ నాకించి.. వేధింపులు!!
Ragging incident: కేరళలోని ఎర్నాకులం త్రిప్పునితురలో 15 ఏళ్ల విద్యార్థి మిహిర్ ఆత్మహత్య కలకలం రేపింది. జనవరి 15న పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన అతడు, తల్లిదండ్రుల కళ్ల ముందు 26వ అంతస్తు అపార్ట్‌మెంట్‌పైకి వెళ్లి దూకాడు. 3వ అంతస్తు బాల్కనీలో పడిపోయిన మిహిర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రాథమిక దర్యాప్తులో, మిహిర్ ర్యాగింగ్ కారణంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తల్లిదండ్రులు అనుమానించారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
Kerala Student Ragging incident
తల్లి రాజ్నా తన కుమారుడి మృతిపై స్పష్టత పొందేందుకు అతడి స్నేహితులతో మాట్లాడగా, భయంకర నిజాలు బయటపడ్డాయి. తోటి విద్యార్థులు అతడిని చులకనగా చూస్తూ పదేపదే వేధించారని, అతని చర్మవర్ణం, రూపం గురించి అవహేళన చేశారని తెలిసింది. అంతేకాదు, మరికొందరు అతడిని బలవంతంగా బాత్రూం టాయిలెట్ నాకించారని, పైగా ఫ్లష్ ఆన్ చేసి అతడిని తడిపారని సమాచారం. ఈ దారుణ ఘటనల వల్ల మిహిర్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు.
తల్లిదండ్రులు మిహిర్ స్నేహితులు చెప్పిన విషయాలను స్క్రీన్షాట్ల రూపంలో డీజీపీ, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. తమ కుమారుడిని ర్యాగింగ్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన విద్యాసంస్థల్లో ర్యాగింగ్ ఆగడాలను వెలుగులోకి తెచ్చింది. విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు మరింత జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.