Minister Nageswara Rao: తెలంగాణలో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి చెప్పారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొనుగోలు కేంద్రాలు ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తాయని స్పష్టం చేశారు.
Minister Nageswara Rao Announces Cotton Purchase Guidelines
ఈ ఏడాది రాష్ట్రంలో 42.23 లక్షల ఎకరాల్లో పత్తి సాగించినట్లు మరియు 25.33 లక్షల టన్నుల ఉత్పత్తి అంచనా వేయాలని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ఏ కేంద్రానికి వెళ్ళాలనుకుంటున్నారో, అక్కడ పత్తిని త్వరగా అమ్ముకోవడానికి వాట్సప్ ద్వారా సమాచారం అందించాలని చెప్పారు. అమ్మిన పంటకు సంబంధించిన డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వరకు వారి వివరాలను తెలుసుకునేందుకు సులభమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Also Read: Chandrababu: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. 100 కోట్లు నిధులు మంజూరు చేసిన కేంద్రం.. కానీ ?
సీసీఐ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులు ఆధార్ కార్డు తీసుకురావడం తప్పనిసరి అని మంత్రి తెలిపారు. ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ధృవీకరించిన తర్వాతే డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వెల్లడించారు. దేశవ్యాప్తంగా సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే సీసీఐ కేంద్రాలు పనిచేస్తున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు కొనుగోలు కేంద్రాలు పని చేస్తాయన్నారు.
నాణ్యమైన పత్తికి ప్రతి క్వింటాలుకు రూ.7,521 మద్దతు ధర లభిస్తుందని, రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎక్కడైనా రైతులకు ఇబ్బందులు ఎదురైతే, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు.