జమ్మూ కాశ్మీర్లో article 370 రద్దై ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ article 370, 35A ఇప్పుడు పూర్తిగా గతంలో భాగమని, దేశం కొత్త పథంలో దూసుకెళ్తోందని అన్నారు. ఇక్కడ ప్రజలకు ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, రాజ్యాంగ హక్కులపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆయన వివరించారు. అయితే ఈ ప్రాంతంలో రాజకీయ వాతావరణం మాత్రం రోజురోజుకూ మారుతోంది.
Article 370 and Kashmir Tensions
శ్రీనగర్లో పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జాతీయ జెండా తలకిందులుగా కనిపించడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై బీజేపీ ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, త్రివర్ణ పతాకాన్ని అవమానించారని ఆరోపించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం ముఫ్తీకి మద్దతు తెలిపారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని, కేవలం పొరపాటు మాత్రమే అని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 ఆగస్టు 5న సంభవించిన గాయాలు ఇంకా పూర్తిగా మానలేదని ఒమర్ అబ్దుల్లా అన్నారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఇంకా జరగలేదని, ఇది ప్రజలకు నిరాశ కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు ఎటువంటి హెచ్చరికలకు లొంగకుండా నిరసనలు కొనసాగిస్తున్నారు. షోపియన్ ప్రాంతంలో పోలీసులు ఎన్సీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మరోవైపు ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు బీజేపీ జమ్మూ, శ్రీనగర్ నగరాల్లో తిరంగా ర్యాలీలు, ప్రత్యేక వేడుకలను నిర్వహించింది. వారి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని దేశభక్తి ప్రదర్శన చేశారు. ఒక వైపు నిరసనలు, మరో వైపు వేడుకలతో జమ్మూ కాశ్మీర్ రాజకీయ పరిస్థితి అనిశ్చితిగా మారింది. ప్రజల్లో భద్రతపైనా, భవిష్యత్తు పైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలా మారుతాయో చూడాలి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





