Avanthi Srinivas Resigns: వైసీపీకి షాక్.. అవంతి శ్రీనివాస్ రాజీనామా వెనుక కారణాలు ఇవే!!
Avanthi Srinivas Resigns: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా భారీ చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ, జగన్ రెండో క్యాబినెట్‌లో ఆయన్ని పక్కనబెట్టడం, భీమిలి నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడం వంటి పరిణామాలు ఆయనకు తీవ్ర మనోవేదన కలిగించాయి.
Avanthi Srinivas Resigns from YSRCP
తాజాగా, అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసి పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు లేఖ పంపించారు. “వ్యక్తిగత కారణాలతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే భీమిలి నియోజకవర్గ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేస్తున్నాను” అంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను వైసీపీ జాతీయ అధ్యక్షుడు జగన్‌తో పాటు రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.
Also Read: Manchu Lakshmi Post: మోహన్ బాబు కుటుంబ కలహాలు.. మనోజ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన మంచు లక్ష్మీ!!
అవంతి శ్రీనివాస్ రాజకీయ ప్రస్థానం చాలా వైవిధ్యంగా సాగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా మొదటి విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున అనకాపల్లి నుంచి ఎంపీగా గెలిచారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రి పదవిని పొందారు. కానీ, 2024లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేతిలో 92,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఆయనకు కఠినమైన ఎదురుదెబ్బగా నిలిచింది.
ఆత్మవిమర్శతో, తాను ఎదుర్కొన్న రాజకీయ పరిస్థితులతో అవంతి శ్రీనివాస్ పార్టీకి వీడ్కోలు చెప్పినట్లు కనిపిస్తోంది. పార్టీ అంతర్గత వివాదాలు, ఆయన వైసీపీలో పొందిన అనుభవాలు, పరిణామాలను జీర్ణించుకోలేకపోవడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి దారితీశాయని భావిస్తున్నారు. ఈ రాజీనామా జగన్ పార్టీకి మిగిలిన కీలక నేతలపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. వైసీపీ నుంచి అవంతి బయటికెళ్తున్నట్లు ప్రచారం కావడంతో, టీడీపీకి చేరుతారా లేక పూర్తిగా రాజకీయాలకు దూరమవుతారా అన్నది ఆసక్తికర అంశంగా మారింది.