MLAs Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం.. ఎమ్మెల్యేల అనర్హత కేసు.. ఎవరికీ మూడుతుందో?

MLAs Disqualification Case: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ స్పీకర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపిస్తూ, “సభాపతికి రాజ్యాంగం ఇచ్చిన ప్రత్యేక అధికారాలను కోర్టులు హరించలేవు” అని పేర్కొన్నారు.
BRS MLAs Disqualification Case Updates
ముకుల్ వాదనలపై స్పందించిన జస్టిస్ గవాయ్, స్పీకర్ నిర్ణయం ఆలస్యం చేస్తే కోర్టు మౌనంగా ఉండాల్సిందా అని ప్రశ్నించారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తాయని గుర్తు చేశారు. అసెంబ్లీ స్పీకర్ ఒక నిర్దిష్ట సమయానికే నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు సూచనపై వాదనలు కొనసాగుతున్నాయి.
ఇదే సమయంలో, బీఆర్ఎస్ పార్టీ జనవరి 15న ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మరికొందరు తిరిగి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ముఖ్యంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే, కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభకు పోటీ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు అనే అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకులు నిగానిగా చూస్తున్నారు. ముఖ్యంగా కోర్టు తీరును బట్టి తెలంగాణలో రాజకీయ శక్తి సమీకరణాలు మళ్లీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దానం నాగేందర్ అంశం స్పష్టతకు వస్తే, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితేంటన్నది క్లారిటీ వస్తుంది.