Champions Trophy 2025: లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదే!!

Champions Trophy 2025: ఎనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత, క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇవాళ ప్రారంభమైంది. చివరిసారి 2017లో జరిగిన ఈ మెగా టోర్నమెంట్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. ఈసారి టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, భద్రతా కారణాల వల్ల భారత జట్టు తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడనుంది. 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ ఒక ICC టోర్నమెంట్‌కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వేదికలు మరియు ప్రత్యక్ష ప్రసారం
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 15 వన్డే మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో, మిగతా మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండి స్టేడియాల్లో జరగనున్నాయి. ఈ మెగా ఈవెంట్‌కి స్టార్ స్పోర్ట్స్ ప్రసార హక్కులు దక్కించుకుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌లో లైవ్ టెలికాస్ట్ లభిస్తుందిగా, మొబైల్ వినియోగదారులు JioCinema లో వీక్షించవచ్చు.
ప్రైజ్ మనీ & మ్యాచ్‌ల సమయం
ఈ టోర్నమెంట్ మొత్తం రూ. 59 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించబడింది. విజేత జట్టు రూ. 20.8 కోట్లు, రన్నరప్ రూ. 10.4 కోట్లు పొందుతుంది. సెమీఫైనల్ చేరిన జట్లకు రూ. 5.2 కోట్లు చొప్పున లభిస్తాయి. మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత జట్టు & మ్యాచ్‌ల షెడ్యూల్
భారత జట్టుకు రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా వంటి స్టార్లు నాయకత్వం వహిస్తారు. భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్, ఫిబ్రవరి 23న పాకిస్థాన్, మార్చి 2న న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లు అత్యంత ఉత్కంఠభరితంగా ఉండే అవకాశం ఉంది. (Champions Trophy 2025)