Thandel Making: రియలిస్టిక్ మాస్టర్‌పీస్.. సముద్రంలో లైవ్ షూటింగ్.. ఒక ఎపిసోడ్ కి 20 కోట్ల ఖర్చు!!
Thandel Making: అక్కినేని నాగ చైతన్య హీరో గా నటిస్తున్న ‘తండేల్’ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారులు పాకిస్తాన్ కోస్ట్ గార్డు చేత పట్టుబడి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన కథ ఈ సినిమాకు ప్రేరణగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలోని డి. మత్స్యలేశం గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.
Chandoo Mondeti on Thandel Making
ఈ సందర్భంగా దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ‘కార్తికేయ 2’ అనుభవం ‘తండేల్’ సినిమాకు ఎంతో ఉపయోగపడిందని, తాను ఎప్పుడూ అనుకున్న బడ్జెట్‌ను దాటి సినిమా చేయనని తెలిపారు. కథ రాయడానికి ముందుగా విస్తృతమైన రీసెర్చ్ చేశామని, మత్స్యకారుల జీవితాన్ని దగ్గరగా అనుభవించేందుకు మళ్లీ మత్స్యలేశం వెళ్లి అక్కడి జీవన విధానాన్ని వివరంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.
ఈ సినిమాకు సంబంధించి ఓ కీలక ఎపిసోడ్ కోసం రూ.18 కోట్లు ఖర్చు చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. సముద్రాన్ని లైవ్ లొకేషన్‌గా మార్చి, మినియేచర్ బోట్లతో అత్యంత రియలిస్టిక్ విజువల్స్ క్రియేట్ చేశామని అన్నారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకు అద్భుత అనుభూతిని అందిస్తుందని చెప్పారు. ‘థండేల్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రియల్ స్టోరీ ఆధారంగా రూపొందిన ఈ సినిమా తెలుగు చిత్రసీమలో కొత్త ఒరవడి సృష్టించనుందా? అన్నది ప్రేక్షకులు ఫిబ్రవరి 7న తేల్చనున్నారు.