Case Against Posani: సంతకం పెట్టొద్దని భార్యకు చెప్పిన పోసాని.. హాస్పిటల్ కి వెళ్లాలని చెప్పినా వదలని పోలీసులు!!

Case Against Posani: తెలుగు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి మైహోం అపార్ట్‌మెంట్ లో ఉన్న అతని నివాసానికి ఓబులవారిపల్లి పోలీసులు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ సమయంలో కొంత నాటకీయత చోటుచేసుకుంది. పోలీసులు ఇంటికి రాగానే పోసాని ప్రతిఘటించడానికి ప్రయత్నించారు. “మీరు ఎవరు? నేను మీతో ఎందుకు రావాలి?” అని ప్రశ్నించారు. అతని ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో చికిత్స అవసరమని చెప్పారు. కానీ, పోలీసులు చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
CID Registers Case Against Posani
గత ప్రభుత్వ హయాంలో, పోసాని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా పనిచేశారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా పోసాని పై అనేక కేసులు నమోదయ్యాయి. జనసేన రాయలసీమ కన్వీనర్ జోగినేని మణి ఫిర్యాదు మేరకు, ఓబులవారిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద పోసానిపై కేసు నమోదైంది.
పోసాని అరెస్ట్ పై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. మహిళా నేత శ్యామల ఈ అరెస్టును అక్రమ చర్యగా అభివర్ణించారు. “ఇది కక్ష సాధింపు చర్య, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు, పోసాని రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించినా, అతనిపై కుట్రపూరిత కేసులు పెట్టారని ఆరోపించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, “చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు” అంటూ విమర్శించారు.
ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు దారి తీసే అవకాశం ఉంది. పోసాని వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా అరెస్ట్ అయ్యారా? లేక రాజకీయ కక్ష కారణమా? అన్నది నిజమెవరికి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోసాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఈ కేసు భవిష్యత్ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది? అన్నది రానున్న రోజుల్లో స్పష్టత వస్తుంది.