Urea Crisis: తెలంగాణలో యూరియా కొరత.. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. హరీశ్ రావు విమర్శలు!!

Urea Crisis: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులు యూరియా కొరతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేయగా, ఇప్పుడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకుని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
Harish Rao Slams Congress Over Urea Crisis
తెలంగాణలో రైతు సంక్షేమం తగ్గిపోతోందని హరీష్ రావు విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ పాలనలో రైతే రాజుగా ఉండగా, ఇప్పుడు రైతులు నడిరోడ్డుపై నిలబడే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన యూరియాను సమయానికి సరఫరా చేయడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. మండుటెండలో రైతులు తీవ్ర కష్టాలు పడుతుంటే, ప్రభుత్వం ప్రతిస్పందించకపోవడం అన్యాయమని మండిపడ్డారు.
రైతు డిక్లరేషన్ పేరుతో మోసం చేసి, రుణమాఫీ, పంట బోనస్ వాగ్దానాలను నిలబెట్టుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ రైతులకు నష్టం కలిగించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
యూరియా కొరత వెంటనే తొలగించాలని, రైతులకు మద్దతుగా నిలిచేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైతులు నష్టపోతే, రాష్ట్రం నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.