Turmeric: కూరలో ‘పసుపు’ ఎక్కువైందా..అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
Turmeric: పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే పసుపు ఎక్కువగా వాడడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరలలో వాడే పసుపు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పసుపును ఎక్కువ మొత్తంలో తిన్నట్లయితే కడుపునొప్పి, వాంతులు, వికారం, వీరేచనాలు, జీర్ణ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మనం రోజువారి ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
Health Benefits of Tumeric and Curcumin
ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్నటువంటి ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయం చేస్తుంది. అయితే పసుపు తీవ్రత పెరిగినట్లయితే పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇది గ్యాస్టిక్ సమస్యలు ఉన్న వారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి కొన్ని సార్లు పేగుల్లో అల్సర్లకు దారితీస్తుంది.
ఇదివరకే రక్తం చిక్కగా ఉండటం వల్ల మందులు వాడుతున్న వారు పసుపును చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. అలాగే ఏ రకమైన శస్త్ర చికిత్సకు ముందు పసుపును తినకూడదు. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది. పసుపులో ఆక్సలైట్ ఉన్నందున కిడ్నీ సమస్యలు ఉన్నవారు పసుపును తినకూడదు. పసుపు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం, రక్తహీనత ఏర్పడుతుంది. అందరికీ పసుపు అతిగా తినడం వల్ల అలర్జీ సమస్యలు వస్తాయి. చర్మంపై దద్దుర్లు, శ్వాస సమస్యలు, దురదలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నవారు పసుపును తినడం వెంటనే మానేయాలి.