Jayanth and the Jingo Pen: పిల్లలు తప్పక చూడాల్సిన సినిమా.. రివ్యూ!

Jayanth and the Jingo Pen

బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన చిత్రం ‘జయంత్ అండ్ ద జింగో పెన్’ (Jayanth and the Jingo Pen). నమో జయం ప్రొడక్షన్స్ పతాకంపై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించగా.. ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పిల్లల ప్రపంచం, వారి మనోభావాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో పూర్తి రివ్యూలో చూద్దాం.

సినిమా: జయంత్ అండ్ ద జింగో పెన్ (Jayanth and the Jingo Pen)
విడుదల తేదీ: నవంబర్ 14, 2026 (థియేటర్లలో)
నటీనటులు: మాస్టర్ జయంత్ బొలిశెట్టి, ఊహా రెడ్డి (‘మన శంకర వర ప్రసాద్’ ఫేమ్), సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు.
దర్శకత్వం: నవీన్ దేశబోయిన
నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి (నమో జయం ప్రొడక్షన్స్)
సంగీతం – పాటలు: ప్రవీణ్ బొలిశెట్టి

Jayanth and the Jingo Pen Movie Review

జయంత్ (మాస్టర్ జయంత్ బొలిశెట్టి)కి లెక్కలు అంటే విపరీతమైన భయం. గణితం సబ్జెక్ట్ అంటేనే అతనికి అస్సలు నకరంపదు. దీనికి తోడు పాఠశాలలో లెక్కల మాస్టారు హర్ష (సత్యం రాజేష్) ఎప్పుడూ కఠినంగా ఉంటూ పిల్లలను భయపెడుతూ పాఠాలు చెబుతుంటాడు. క్లాసులో తోటి పిల్లలంతా జయంత్‌ను చూసి నవ్వుతుంటారు. జయంత్, అతని స్నేహితుల బృందం ఎప్పుడూ బడికి ఆలస్యంగా రావడం, మార్కుల్లో చివరి స్థానంలో ఉండటం పరిపాటిగా మారుతుంది. కొడుకు చేసే అల్లరి పనుల వల్ల తల్లిదండ్రులు (ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్) తరచూ ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ తలదించుకోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో జయంత్ చేతికి అనుకోకుండా ‘జింగో పెన్’ దొరుకుతుంది. ఆ పెన్ను దొరికిన తర్వాత జయంత్ జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అసలు ఆ జింగో పెన్ వెనుక ఉన్న ఫ్లాష్‌బ్యాక్ ఏమిటి? ఈ కథలో కెప్టెన్ సత్యహరిశ్చంద్ర ప్రసాద్ (తనికెళ్ల భరణి), స్కూల్ ప్రిన్సిపాల్ (కాశీ విశ్వనాథ్), అశోక్ కుమార్ పాత్రల ప్రాధాన్యత ఏమిటన్నదే మిగతా కథ.

విశ్లేషణ: చిన్నారుల కోణం నుంచి చెప్పే కథలు ఎప్పుడూ మనసుకు హత్తుకుంటాయి. పిల్లలు బయటకు చెప్పుకోలేని బాధలు, వారి అంతర్మథనం, మానసిక సంఘర్షణను దర్శకుడు నవీన్ దేశబోయిన ఎంతో హృద్యంగా తెరపై ఆవిష్కరించారు. తల్లిదండ్రులు, గురువుల వ్యవహారశైలి పిల్లలపై ఎంతటి ప్రభావం చూపుతుందో చక్కటి సందేశంతో చూపించారు. అర్థవంతమైన మాటలు, పాటలు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. సినిమా ప్రథమార్థం అంతా ఎంతో సరదాగా, ఉత్సాహంగా సాగిపోతుంది. పాఠశాలలో జయంత్ చేసే అల్లరి చేష్టలు, అతని మిత్రబృందం పండించే వినోదం ప్రేక్షకులను నవ్విస్తాయి. తల్లిదండ్రులతో జయంత్ జరిపే సంభాషణలు, దేవుడి గురించి అడిగే సందేహాలు అంతర్లీనంగా మంచి ఆలోచనను రేకెత్తిస్తాయి. ముఖ్యంగా “పేర్లు వేరైనా టేస్ట్ ఒక్కటే.. పేర్లు వేరైనా దేవుడు ఒక్కడే” అని చెప్పే సన్నివేశం, అక్కడి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఊహ, జయంత్ మధ్య వచ్చే సన్నివేశాలు సైతం సరదాగా సాగుతాయి. లెక్కల మాస్టారును పోలీసుల వద్ద జయంత్ ఇరికించడం, ఆ విషయాన్ని ఊహ కనిపెట్టే ఆసక్తికర మలుపుతో ఇంటర్వెల్ పడుతుంది.

ద్వితీయార్థంలో జయంత్ దగ్గరకు ‘జింగో పెన్’ రావడం, అప్పటివరకు భయపెట్టిన లెక్కలను సులభంగా సాల్వ్ చేస్తూ క్లాసులో, స్కూల్లో హీరోగా మారిపోయే సన్నివేశాలు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆ పెన్ను చెప్పినట్టుగా జయంత్ బుద్ధిగా నడుచుకోవడం, బడిలో తోటి విద్యార్థులకు చెప్పే చిట్కాలు అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఆ తర్వాత జరిగే స్కూల్ బస్సు ప్రమాదం, ఊహ ఆసుపత్రిలో చేరే సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. “ఓటమిని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి” అంటూ లెక్కల మాస్టారు పిల్లలకు వివరించే సీన్, తాత-మనవళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు గుండెను తాకుతాయి. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. చివర్లో తండ్రీకొడుకుల సంభాషణ, జయంత్‌లో వచ్చే పరివర్తన ఆకట్టుకుంటాయి. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేకుండా ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన కుటుంబ చిత్రాన్ని చూసిన అనుభూతి కలుగుతుంది.

నటీనటులు: మాస్టర్ జయంత్ బొలిశెట్టి తన సహజ నటనతో సినిమాను భుజాన వేసుకున్నాడు. మొదటి చిత్రమే అయినా ఎక్కడా తడబాటు లేకుండా ఎంతో అవలీలగా నటించాడు. తన అల్లరితో నవ్విస్తూనే, ఎమోషనల్ సన్నివేశాల్లో కంటతడి పెట్టించి ఆలోచింపజేశాడు. తండ్రి పాత్రలో ఆశిష్ గాంధీ ఎంతో సహజంగా ఒదిగిపోయారు. తల్లిగా మానస రాధాకృష్ణన్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నారు. బేబీ ఊహా రెడ్డి తెరపై ఎంతో క్యూట్‌గా కనిపిస్తూ మెప్పించింది. లెక్కల మాస్టారుగా సత్యం రాజేష్‌కు మంచి ప్రాధాన్యమున్న పాత్ర లభించింది. సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, అశోక్ కుమార్ తమ అనుభవంతో పాత్రలకు బలాన్నిచ్చారు. జయంత్ ఫ్రెండ్స్ గ్యాంగ్, ఇతర బాలనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతికంగా ఈ చిత్రం ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కింది. విజువల్స్ చాలా సహజంగా, కంటికింపైన రీతిలో ఉన్నాయి. ప్రవీణ్ బొలిశెట్టి అందించిన సంగీతం ఉత్సాహభరితంగా సాగుతూ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు సందర్భానుసారంగా ఉంటూనే చక్కని అర్థాన్ని అందించాయి. మనసును తాకే సంభాషణలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఆర్ట్ వర్క్, కాస్ట్యూమ్స్, ఎడిటింగ్ అన్నీ కథకు తగ్గట్టుగా చక్కగా కుదిరాయి. కొత్త నిర్మాత అయిన దివ్య ప్రవీణ్ బొలిశెట్టి తన తొలి ప్రయత్నంగా మంచి విలువలతో కూడిన చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా ప్రేక్షకులకు అందించారు.

ఫైనల్ గా బాలల దినోత్సవ కానుకగా వచ్చిన ‘జయంత్ అండ్ ద జింగో పెన్’ వినోదంతో పాటు చక్కని సందేశాన్ని అందించే స్వచ్ఛమైన చిత్రం. పిల్లల మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, పిల్లలు ఎలా మెలగాలి అనే అంశాలను సున్నితంగా చూపించిన ఈ సినిమాను పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా కలిసి చూడవచ్చు.

Rating: 3/5

ఇవి కూడా చదవండి:

మరిన్ని వార్తలకోసం..


Visited 3 times, 1 visit(s) today