KCR Criticizes Congress: కేసీఆర్ ఆగ్రహం.. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పథకాలు గంగలో కలిశాయా?
KCR Criticizes Congress: తెలంగాణ రాష్ట్రంలో పథకాల అమలు పూర్తిగా స్థంభించిపోయిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మోసం చేసిందని మండిపడ్డారు. తమ హయాంలో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ఎప్పటికప్పుడు అమలు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రైతులకు మద్దతుగా రైతుబంధును కొనసాగించామని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మెరుగ్గా ఉన్నా, పథకాల అమలులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేసినందుకు ప్రతిఫలంగా కేవలం నిర్లక్ష్య పాలన మాత్రమే అందిందని ఆరోపించారు.
KCR Criticizes Congress Over Welfare Schemes
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కోహీర్, జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, “నేను ప్రస్తుతం మౌనంగా ఉన్నా, కానీ అవసరం అయితే గట్టిగా బదులిస్తా,” అని హెచ్చరించారు.
కేసీఆర్ తన యాక్టివ్ రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేశారు. “ఫిబ్రవరిలో ఒక భారీ బహిరంగ సభను నిర్వహిస్తాం,” అని ప్రకటించారు. ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు నిర్లక్ష్యంతో ఎండిపోతున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని పునరుద్ధరించే ఉద్దేశం కూడా లేదని మండిపడ్డారు.