Mayoori Kango: మహేష్ బాబు హీరోయిన్ మయూరి కాంగో.. కలిసి రాకపోవడంతో కార్పొరేట్ రంగంలోకి!!

Mayoori Kango: బాలీవుడ్‌లో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించిన మయూరి కాంగో, ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, కార్పొరేట్ రంగంలో మాత్రం విశేషమైన గుర్తింపు పొందింది. 1995లో ‘నసీమ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఆమె, ‘పాపా కెహెతే హై’, ‘హోగీ ప్యార్ కీ జీత్’, ‘బేటాబీ’, ‘బాదల్’ వంటి హిందీ చిత్రాల్లో నటించింది. తెలుగు చిత్రసీమలో మహేష్ బాబుతో ‘వంశీ’ సినిమాలో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Mayoori Kango Career After Bollywood
నటనలో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో, టీవీ సీరియల్స్ కూడా చేసింది. అయినప్పటికీ, సినీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం ఆమెకు సాధ్యం కాలేదు. దీంతో, పూర్తిగా కొత్త మార్గాన్ని ఎంచుకుని కార్పొరేట్ రంగంలోకి అడుగుపెట్టింది. 2003లో ఎన్‌ఆర్‌ఐ ఆదిత్య థిల్లాన్‌ను వివాహం చేసుకుని న్యూయార్క్‌లో స్థిరపడిన మయూరి, అక్కడే బరూచ్ కాలేజ్ జాక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి MBA పూర్తి చేసింది.
తన ప్రతిభతో కార్పొరేట్ రంగంలో దూసుకెళ్లిన ఆమె, ప్రముఖ గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ లో మ్యానేజింగ్ డైరెక్టర్ (MD) గా పనిచేసింది. ప్రస్తుతం గూగుల్ ఇండియా (Google India) లో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీ రోల్ లో కొనసాగుతూ, డిజిటల్ స్ట్రాటజీస్, ఇన్నోవేషన్స్ విభాగాలను పర్యవేక్షిస్తోంది. సినీ రంగంలో ఆశించిన గుర్తింపు దక్కకపోయినప్పటికీ, మయూరి తన కష్టపడి పనిచేసే ధృఢ సంకల్పంతో కార్పొరేట్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.