ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చోటు సంపాదించిన వ్యక్తి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్ మొహిసిన్ రజాయీని ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలి కార్యదర్శిగా నియమించడం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఆగస్టు 9న జరిగిన ఈ నియామకం కేవలం ఓ సాధారణ పరిపాలనా మార్పుగా భావించలేం. పశ్చిమాసియా రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేసే ప్రమాదకరమైన అడుగుగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
అర్జెంటీనాలో 1994లో జరిగిన బ్యూనస్ ఎయిర్స్ దాడి కేసులో నిందితుడిగా ఉన్న రజాయీ, ఇప్పుడు ఇరాన్ భద్రతా వ్యవస్థలో కీలక బాధ్యతలు చేపట్టడం పాశ్చాత్య దేశాలను కలవరపెడుతోంది. అమెరికా నిఘా వర్గాలు ఈ పరిణామాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఎందుకంటే, అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్కచేయని వ్యూహాలకు రజాయీ పేరు మారుమోగుతుంది. ఈ నియామకం ద్వారా ఇరాన్ పశ్చిమాసియాలో తన ఆధిపత్యాన్ని మరింత దూకుడుగా ప్రదర్శించాలని చూస్తోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రాంతీయ యుద్ధ వాతావరణం ఇప్పటికే తీవ్రంగా ఉన్న తరుణంలో, రజాయీ వంటి ‘మోస్ట్ డేంజరస్’ వ్యక్తిని కీలక పదవిలో కూర్చోబెట్టడం ఇజ్రాయెల్‌కు, అమెరికాకు పెద్ద సవాల్‌గా మారింది. ఇరాన్ తన వ్యూహాత్మక నిర్ణయాలను ఇకపై మరింత కఠినంగా అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నియామకం పశ్చిమాసియాలో కొత్త తుఫానుకు నాంది అవుతుందా అన్న ప్రశ్నతో ప్రపంచ దేశాలు ఆందోళనలో మునిగిపోయాయి.





