Sunrisers Hyderabad: SRH ఓటమికి కారణాలు.. ఓపెనర్లు ఔటైతే అంతే సంగతులు!!

Sunrisers Hyderabad: IPL 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వరుస ఓటములతో అభిమానులను నిరాశపరుస్తోంది. టోర్నీ ఆరంభంలో అదరగొట్టిన హైదరాబాద్ జట్టు, ఆ తర్వాత ఆటతీరులో కుదుపునకు గురైంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్ బ్యాటర్ల వైఫల్యం, బౌలింగ్ విఫలం, ఫీల్డింగ్ లోపాలు SRH జట్టును కష్టాల్లోకి నెట్టాయి. తొలి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోర్ చేసినా, ఆ తర్వాత వరుసగా మూడు పరాజయాలను ఎదుర్కొన్నది. పాయింట్ల పట్టికలో SRH అట్టడుగు స్థానానికి పడిపోవడంతో ప్లే ఆఫ్స్ అవకాశాలు మసకబారుతున్నాయి.
Sunrisers Hyderabad in deep trouble IPL
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని SRH ఛేదించగలదని ఆశించారు. కానీ పవర్ ప్లేలోనే 9 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోవడంతో జట్టు పూర్తిగా కుదేలైంది. చివరకు 80 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. SRH బ్యాటింగ్‌లోని ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఒకసారి ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్ పూర్తిగా కూలిపోతోంది. ఇదే కారణంగా SRH వరుస పరాజయాలను మూటగట్టుకుంది.
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లపై అధికంగా ఆధారపడడం SRHకు పెద్ద సమస్యగా మారింది. ఏ మ్యాచ్‌లోనైనా వారిలో ఎవరో ఒకరు రాణించకపోతే, జట్టు పూర్తిగా కుప్పకూలిపోతోంది. ఈ పరిస్థితిని గమనించిన ప్రత్యర్థి జట్లు SRH ఓపెనర్లను తొందరగా అవుట్ చేయడానికి ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. బౌలింగ్‌లోనూ SRH బలహీనంగా కనిపిస్తోంది. ప్రత్యర్థి జట్లు 200+ స్కోర్ చేయగలుగుతున్నాయి.
ఇప్పటికీ 10 లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్న నేపథ్యంలో SRHకి మరో అవకాశముంది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్, కోచ్ జేమ్స్ ఫ్రాంక్లిన్ అభిప్రాయ భేదాలు కూడా జట్టుపై ప్రభావం చూపిస్తున్నాయి. కచ్చితమైన వ్యూహాలు, స్థిరమైన ఆటతీరు లేకుంటే SRHకి ఈ సీజన్‌లో గట్టి పరీక్షే.