YSRCP leaders: వైసీపీకి చుక్కెదురు..వైసీపీ నేతల ముందస్తు బెయిల్‌పై సుప్రీం కోర్టు నిరాకరణ!!
YSRCP leaders: గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వైసీపీ నేతలకు సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును మార్చాలన్న నిందితుల అభ్యర్థనను జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టంగా తిరస్కరించింది. గతంలో, ముందస్తు బెయిల్ కోసం నిందితులు హైకోర్టును ఆశ్రయించగా, వారు ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో 33 మంది నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది.
Supreme Court rejects YSRCP leaders plea
సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, ముందస్తు బెయిల్ కోసం ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని సూచించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టును రెండు వారాల్లో సంప్రదించేందుకు గడువు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో రెండు వారాలపాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును మార్చకూడదని తేల్చిచెప్పిన సుప్రీం, న్యాయ వ్యవస్థలో కింది స్థాయి కోర్టులకు స్వతంత్ర నిర్ణయం తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది.
2023 ఫిబ్రవరి 19న గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. కార్యాలయ ఆవరణలో ఉన్న కారుకు నిప్పంటించి, కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేశారు. దీనికి కారణం, టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతో టీడీపీ నేతలు ఆగ్రహించడమే. ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ కార్యకర్తలు, వల్లభనేని వంశీపై విమర్శలు గుప్పించారు.
ఈ ఘటనపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పలువురు వైసీపీ అనుచరులపై కేసులు నమోదయ్యాయి. అయితే జగన్ సర్కార్ హయాంలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు మళ్లీ చురుకుగా ముందుకు సాగింది. ఈ క్రమంలో పలువురు నిందితుల అరెస్ట్‌కు అధికారులు సిద్ధమయ్యారు. బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులు నిరాశ చెందిన తర్వాత సుప్రీంకోర్టుకూ వెళ్లినా, అక్కడ కూడా చుక్కెదురైంది.