సంక్రాంతి సినిమాల హవా: కంటెంట్ కే ఓటేసిన ప్రేక్షకులు!!
ఈ సంక్రాంతి పండుగ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు మూడు ప్రధాన చిత్రాలు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బ్లాక్‌బస్టర్‌గా నిలవగా, మరొకటి డీసెంట్‌గా రాణించగలిగింది, మరో చిత్రం మాత్రం పెద్ద స్థాయిలో విఫలమైంది. ఈ ఫలితాలు చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేయగా, ప్రేక్షకుల అభిరుచి ఏంటో ఈ సినిమాల ఫలితాలతో మరోసారి రుజువు అయ్యింది.
ఈ మూడు సినిమాల్లో సంక్రాంతి కి వస్తున్నాం సినిమా భారీ స్థాయిలో విజయాన్ని సాధించింది. 196% బాక్సాఫీస్ రికవరీతో ఈ సారి సంక్రాంతి సీజన్లో గెలుపొందిన చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని పండుగ సీజన్‌కి అసలైన వినోదాన్ని అందించింది. ఆకర్షణీయమైన కథ, భావోద్వేగాలను మేళవించిన ప్రదర్శనతో ఇది కుటుంబ ప్రేక్షకులకు పక్కా పండుగ ట్రీట్‌గా మారింది.
ఇక నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ మాత్రం మిశ్రమ స్పందన పొందింది. 89% రికవరీ రేటుతో సినిమా ఓ మాదిరి రాణించినా, సంక్రాంతి సీజన్లో టాప్ విజేతగా నిలవలేకపోయింది. సినిమా యాక్షన్ సన్నివేశాలు అభిమానులను మెప్పించాయి కానీ, ప్రేక్షకులను పూర్తిగా ఆకర్షించలేకపోయింది. అయినప్పటికీ, మంచి వసూళ్లు సాధించి ఓ మాదిరి విజయాన్ని అందుకుంది.
అయితే, సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద వైఫల్యంగా గేమ్ చేంజర్ సినిమా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం కేవలం 42% రికవరీ మాత్రమే సాధించింది. భారీ హైప్, భారీ పెట్టుబడి ఉన్నప్పటికీ, సినిమా కథలో కొత్తదనం లేకపోవడం, ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ చేయలేకపోవడంతో డబుల్ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. 2025 సంక్రాంతి మరోసారి కంటెంట్ రాజేనని నిరూపించింది. స్టార్ పవర్ కంటే కంటెంట్‌ను ప్రధానంగా చూపించే చిన్న బడ్జెట్ చిత్రం మెగా బడ్జెట్ బ్లాక్‌బస్టర్‌పై విజయం సాధించడం టాలీవుడ్లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేసింది.