పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా నియంత్రణ సరికాదని, పిల్లలను సంపదగా భావించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను గతంలో జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినా, ఇప్పుడు పిల్లల సంఖ్య పెరగడం వల్లే సంపద పెరుగుతుందన్న ఆలోచనకు మారానని తెలిపారు.
ముగ్గురు పిల్లలను కంటే 30 వేలు, నలుగురు పిల్లలను కంటే 40 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని చెప్పారు చంద్రబాబు. గతంలో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించిన నిబంధనను ప్రభుత్వం ఎత్తేసిందని, ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉన్నా అందరూ అర్హులేనని స్పష్టం చేశారు. ఆడపిల్లలు భారం కాదని, మారుతున్న కాలంతో వారు ఉన్నత విద్యలు చదువుతున్నారని, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
దేశంలో వృద్ధుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో బారీగా పెరగడం పెను సవాల్గా మారుతుందని చంద్రబాబు హెచ్చరించారు. చైనా, జపాన్ వంటి దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని, అక్కడ ఇప్పుడు పిల్లలను కనడానికి ప్రోత్సాహకాలు ఇస్తున్న పరిస్థితి ఉందని వివరించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుతుండటం ఆందోళనకరమని, ఈ విషయంపై ఇప్పుడే చర్చ జరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే స్వర్ణాంధ్ర-2047 కాదు, స్వర్ణాంధ్ర-2040 కే సాధిస్తామన్న భావన కలుగుతోందని చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిల్లలను పెంచే బాధ్యతను తండ్రులు కూడా తీసుకోవాలని, పిల్లలు సంపద అనే ఆలోచనను దేశంలోనూ, రాష్ట్రంలోనూ విస్తరింపజేయాలని సూచించారు. ఉత్తమ విద్య, ఆర్థిక వనరుల పెంపు వంటి అంశాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.





