అక్కినేని అఖిల్ లెనిన్ సక్సెస్ తో కొత్త ప్రాజెక్టులపై ఫోకస్ చేశారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద బంపర్ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి రెండు రోజుల్లోనే గ్రాస్ వసూళ్లు భారీగా నమోదు కావడంతో, అఖిల్ కెరీర్ లో ఇది అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఈ సక్సెస్ తో అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అఖిల్ తదుపరి ప్రాజెక్టులపై భారీ ఆసక్తి మొదలైంది. ట్రేడ్ వర్గాలు కూడా లెనిన్ విజయంతో అఖిల్ మార్కెట్ బలంగా మారిందని అంచనా వేస్తున్నాయి.
లెనిన్ ప్రమోషన్ల సమయంలో అఖిల్ అభిమానులకు ఓ హామీ ఇచ్చారు. ఇకపై తన సినిమాల కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, వేగంగా కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. తాజా సమాచారం ప్రకారం, ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అఖిల్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది. వాటిలో ఒక సినిమా అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అఖిల్ ఓ భారీ పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంలో నటించనున్నారు. కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న ఈ సినిమాకు ధీర అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు ప్రచారం. భారీ విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపకల్పన జరుగుతోంది. మరోవైపు, కమర్షియల్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తో కూడా అఖిల్ కొలబొరేషన్ చాన్సెస్ ఉన్నట్లు టాక్.
ఈ లెనిన్ సక్సెస్ తో అఖిల్ కొత్త ప్రాజెక్టులతో పాటు మరో వార్త కూడా వైరల్ అవుతోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించే మల్టీస్టారర్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోందని ప్రచారం. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురూ స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మొత్తంగా లెనిన్ విజయంతో అఖిల్ కెరీర్ లో కొత్త టర్నింగ్ పాయింట్ మొదలైందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.





