YSRCP letter: ఓటర్ల ధృవీకరణలో కీలక మార్పులు.. ఈసీకి వైసీపీ షాకింగ్ లేఖ

వైఎస్సార్సీపీ భారత ఎన్నికల సంఘం దృష్టికి ఓ కీలక విషయం తీసుకెళ్లింది. ఓటర్ల ధృవీకరణ ప్రక్రియను మరింత సరళంగా, ప్రజలకు అనుకూలంగా మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు లేఖ రాశారు. ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల వల్ల సామాన్య ఓటరుకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన వివరించారు.

అన్మ్యాప్డ్, మిస్మ్యాచ్డ్ ఓటర్ల ధృవీకరణ విషయంలో పలు కీలక మార్పులు చేయాలని ఆ లేఖలో ప్రతిపాదించారు. ఓటరు స్వయంగా హాజరు కావాల్సిన పరిస్థితి అనేక సందర్భాల్లో సాధ్యం కావడం లేదని, ముఖ్యంగా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాల వల్ల బయట ఉండే వారికి ఇది పెద్ద సమస్యగా మారుతోందని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఓటరు తరఫున తల్లిదండ్రులు లేదా రక్త సంబంధీకులు అవసరమైన పత్రాలను సమర్పించే అవకాశం కల్పించాలని కోరారు.

ఈ ప్రక్రియలో టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలని, ధృవీకరణ కోసం ఓటర్లను పదే పదే కార్యాలయాలకు రప్పించడం సరికాదని అప్పిరెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుత విధానం వల్ల ఓటు హక్కు వినియోగించుకోవడంలో అనేక మంది వెనుకబడిపోతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంఘం త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Share your love