
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు దిల్లీలో బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించే ప్రతిపక్ష నేతలు అందుకు తగిన విశ్వసనీయ ఆధారాలు చూపాలని ఈ లేఖలో డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీసేలా పదే పదే ‘ఓట్ చోరీ’ అనే పదాలను ప్రయోగిస్తున్నారని మాజీ బ్యూరోక్రాట్లు ఆక్షేపించారు.
Gyanesh Kumar Ex Bureaucrats Support
గతంలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీ, ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్‌రూమ్‌ల పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతల్లో తాము సుదీర్ఘకాలం సేవలందించినట్లు మాజీ అధికారులు లేఖలో గుర్తుచేశారు. తాము ఏ రాజకీయ పార్టీకి చెందినవారం కాదని స్పష్టం చేస్తూ, ఎన్నికల ప్రక్రియ, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను కాపాడేందుకే ఈ ప్రకటన చేశామని పేర్కొన్నారు. గతంలో పోలింగ్ కేంద్రాల వద్ద తుపాకులతో బెదిరింపులు, ప్రభావవంతమైన వ్యక్తుల అనుచరుల దాడులు, బ్యాలెట్ పెట్టెల్లో అక్రమంగా ఓట్లు వేయడం వంటివి జరిగేవని తెలిపారు.
బూత్ క్యాప్చరింగ్ విపరీతంగా పెరగడంతో పార్లమెంటు 1989లోనే దానిని తీవ్రమైన నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యాన్ని వారు ప్రస్తావించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం చేపడుతున్న ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి అవసరమని వారు పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష నేతలు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని దిల్లీలో నిరసనలు చేస్తున్న నేపథ్యంలో, ఈ లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా కొందరు నేతలు చేస్తున్న విమర్శలను మాజీ అధికారులు తోసిపుచ్చారు. నిర్దిష్ట ఆధారాలు చూపకుండా వ్యవస్థలపై బురదజల్లే ప్రయత్నాలు సరికాదని, ఇది ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తుందని వారు హెచ్చరించారు.
మరింత అప్‌డేట్స్ కోసం: ఇక్కడ చూడండి






