Amaravati: రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..? వైసీపీ ఆరోపణలపై కూటమి ప్రభుత్వం క్లారిటీ

అమరావతి రాజధాని భూముల విషయంలో కూటమి ప్రభుత్వం రైతుల అనుమతి లేకుండానే భూములను స్వాధీనం చేసుకుంటుందని వైసీపీ ఆరోపణలు చేస్తుండగా.. ప్రభుత్వం దీనిపై క్లారిటీ ఇచ్చింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో భారీ ప్రకటన విడుదల చేసి, రైతులకు పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం కేవలం 2.77 ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూమికి ప్రభుత్వం రూ.7.68 కోట్ల పరిహారం నిర్ణయించింది.

శుక్రవారం రాత్రే అధికారులు బాధిత రైతులకు ఈ పరిహారాన్ని అందించేందుకు ప్రయత్నించినా.. వారు దాన్ని తిరస్కరించారు. దీంతో అధికారులు ఆ పరిహారాన్ని విజయవాడలోని ఎల్ఆర్ఆర్లో డిపాజిట్ చేశారు. తర్వాత గడువు ముగిసినా రైతుల నుంచి స్పందన రాకపోవడంతో.. శనివారం పోలీసుల బలగాలతో అధికారులు భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లారు. ఈ సమయంలో 10 మంది రైతులు వారిని అడ్డుకోవడంతో రైతులు, పోలీసుల మధ్య పెనుగులాట జరిగింది. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు భూసేకరణ పూర్తయి, సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఉన్న చివరి అడ్డంకి తొలగిపోయింది.

వైసీపీ అధినేత జగన్ చేసిన భూముల ఆరోపణల్లో నిజం లేదని తేలిపోయింది. ప్రభుత్వం పరిహారం ప్రకటించి, రైతులకు అందించేందుకు వెళ్లినా నిరాకరణ ఎదురైంది. ఈ వ్యవహారంలో రాజధాని భూముల సేకరణ ప్రక్రియ పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరిగినట్లు స్పష్టమైంది. కూటమి ప్రభుత్వం ఈ మొత్తం ఈవెంట్పై క్లారిటీ ఇచ్చింది, వైసీపీ ఆరోపణలు అబద్ధమని నిరూపించింది.

ఈ సంఘటనతో అమరావతి నిర్మాణానికి మార్గం సుగమం అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని, రైతుల భూములను బలవంతంగా లాక్కోలేదని అధికారులు చెబుతున్నారు. రాజధాని భూముల సేకరణపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు రాజకీయంగా ప్రేరితమైనవి మాత్రమే అనే అభిప్రాయం బలపడింది. ప్రస్తుతం ఈ ట్రాక్ రోడ్ నిర్మాణంతో అమరావతి డెవలప్మెంట్ వేగంగా సాగనుంది.

Share your love