
బ్యానర్: చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత: వేణు దోనేపూడి
దర్శకత్వం: గుణి మంచికంటి
నటీనటులు: టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా రవీంద్ర, అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యల్, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా తదితరులు
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ‌్వేత దోనేపూడి
సంగీతం : ఎలక్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ)
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్ కృష్ణ
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి
సెన్సార్: యు/ఎ
రన్ టైమ్: 135 నిమిషాలు
Ba Ba Blacksheep Review Latest
కొన్ని చోట్ల సమర్ధత, ఆలోచన కంటే సెంటిమెంట్ ఎక్కువ పని చేస్తుంది..ఇది ఎవరూ కాదనలేని నిజం. ఈ పాయింట్‌ను ఆధారంగా చేసుకుని యువ దర్శకుడు గుణి మంచి కంటి తయారు చేసుకున్న కథకు వేణు దోనేపూడి వంటి నిర్మాత సపోర్ట్ దొరకటంతో రూపొందిన సినిమాయే ‘బా బా బ్లాక్ షీప్’. డిఫరెంట్ క్రైమ్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ చిత్రం ఆసాంతం మేఘాలయాలోనే రూపొందటం విశేషం. మేఘాలయాలో ఎంటైర్ షూటింగ్ పూర్తి చేసుకున్న తొలి దక్షిణాది చిత్రం కూడా ఇదే. మరి చిత్రాలయం స్టూడియోస్ రూపొందించిన ‘బా బా బ్లాక్ షీప్’ సినిమా ఎలా ఉంది? ప‌్రేక్షకులను ఆకట్టుకుందా..లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
దేశంలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవటానికి ఇద్దరు బిజినెస్ టైకూన్స్ పోటీపడతారు. అయితే వారిలో ఒకరు ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవటానికి దానికి కీలకమైన పెద్దాయనను ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు. ఆయన్ని సెంటిమెంట్‌తో తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటాడు. దాని కోసం తన అసిస్టెంట్ మూర్తి(శుభలేఖ సుధాకర్)తో కలిసి ఓ ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా స్వాతంత్ర్య సమయంలో కనిపించకుండా పోయిన ఓ వస్తువును సంపాదించి పెద్దాయనకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకుంటాడు. ఆ పనిని గ్యాంగ్‌స్టర్ జాన్(ఉపేంద్ర లిమాయె)కు అప్పగిస్తాడు. ఈ కథ ఇలా సాగుతుండగా మరో వైపు సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు), తన ప్రేయసి మేరి(సమృద్ధి)ని మేఘాలయాలో పెళ్లి చేసుకుంటుంటాడు. పెళ్లి జరిగేలోపు ఫ్రెండ్ అయిన సత్తిపండుతో కలిసి పార్టీ చేసుకోవాలనుకుంటాడు సందీప్(అక్షయ్ లగుసాని). అయితే పోలీసుల ఎంట్రీతో పార్టీ ఆగిపోతుంది. సందీప్, సత్య కలిసి కారులో సత్య పారిపోతున్న కమ్రంలో ఓ యాక్సిడెంట్ అవుతుంది. ..కారు నుంచి బయటకు వచ్చిన సందీప్ అక్కడ దొరికిన ఓ బాక్స్ తీసుకుని వెళ్లిపోతాడు. ఆ తర్వాత సత్య, మేరి పెళ్లి జరుగుతున్న సమయంలో అక్కడకు గ్యాంగ్ స్టర్ జాన్ ఎంట్రీ ఇస్తాడు. కనిపించకుండా పోయిన తన బాక్స్ ఎక్కడ? అంటూ అడగటమే కాకుండా సందీప్, సత్తిపండుని కిడ్నాప్ చేసి ఇబ్బందులు పెడతాడు. బాక్స్ తీసిన … మళ్లీ దాన్ని తీసుకొచ్చి ఇవ్వకపోతే, సత్తిపండుని చంపేస్తానంటాడు. దీంతో ఫ్రెండ్ కోసం.. మరో ఫ్రెండ్ జాన్వీ(విస్మయశ్రీ)తో కలిసి బాక్స్‌ను వెతకటానికి వెళతాడు. ..సత్తిపండు పెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగిందా? బాక్స్ కోసం జాన్ ఏం చేశాడు? చివరకు బాక్స్ దొరికిందా? అసలు ఇంతకు ఆ బాక్స్‌లో ఏముంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ:
‘బా బా బ్లాక్ షీప్’ కథను దర్శకుడు గుణి మంచికంటి క్రైమ్ కామెడీగా తెరకెక్కించాడు. ఆయన చెప్పిన కథను నమ్మి నిర్మాత వేణు దోనేపూడి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చారు. క్రైమ్ కామెడీ అంటే ఆడియెన్స్ మైండ్‌లో సినిమాను ఇలాగే తెరకెక్కించి ఉంటారనే ఆలోచన ఉంటుంది. అయితే నిర్మాత వేణు ఇచ్చిన సపోర్ట్‌తో మేఘాలయాలో సినిమాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తి చేశారు. అది కూడా తక్కువ రోజుల్లో లిమిటెడ్ బడ్జెట్‌లో. అయితే స్క్రీన్‌పై సినిమా చూస్తే చక్కటి విజువల్స్‌తో మెప్పిస్తుంది. అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రఫీ బావుంది. లక్ట్రానిక్ కిలి, ఆనంద్(ఆర్కాడొ) అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారింది. సమయమే ఇంద్రజాలం.. వే వేల.. అజా మేరి జాన్ సాంగ్స్ అలరిస్తాయి.
నటీనటుల విషయానికి వస్తే అజయ్ లగుసాని ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. నటనతో పాటు డాన్సులతోనూ అలరించాడు. సత్తిపండు పాత్రలో విష్ణు ఓయ్ పాత్ర నవ్విస్తుంది. తన లుక్, డైలాగ్ డెలివరి ఇవన్నీ కాస్త డిఫరెంట్‌గా అనిపిస్తాయి. అనిమల్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో మెప్పించిన ఉపేంద్ర లిమాయె ఈ సినిమాలో మరో డిఫరెంట్ రోల్‌లో కనిపించాడు. సినిమా ఆసాంతం గ్యాంగ్ స్టర్ పాత్రలో తనదైన నటనతో ఆయన మెప్పించాడు. విస్మయశ్రీ, మాల్వీ, పోలీస్ ఆఫీసర్‌గా నటించిన రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్ ఇలా అందరూ వారి పాత్రలకు అనుగుణంగా ఒదిగిపోయారు.
సినిమా కథలోని ట్విస్టులు, టర్నులు.. కామెడీ ఆడియెన్స్‌ను అలరిస్తాయి. సినిమా టేకాఫ్ అయిన తీరు బావుంది. క్లైమాక్స్‌లో ట్విస్ట్.. దానికి కొనసాగింపు ఉంటుందనే కోణంలో ఇచ్చిన ట్విస్ట్ బావున్నాయి. పాత్రలు ఎక్కువగా కనిపించటం.. గతంలో వచ్చిన క్రైమ్ కామెడీ తరహాలో సినిమా రన్ అవుతున్నట్లు అనిపించటం మినహా ‘బా బా బ్లాక్ షీప్’ను చూసి ఎంజాయ్ చేయవచ్చు.
చివరగా.. ‘బా బా బ్లాక్ షీప్’.. ఎంటర్‌టైనింగ్ క్రైమ్ కామెడీ
రేటింగ్: 3/5






