గోదావరి జలాల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా గోదావరి నదీ జలాలను సాధ్యమైనంత ఎక్కువ మేరకు ఎత్తిపోయాలని, వాటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
రాష్ట్రంలో నీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి జలాలను వృథా చేయకుండా ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం నదిలో లభిస్తున్న జలాలను పూర్తిస్థాయిలో ప్రాజెక్టులకు మళ్లించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో కలిసిపోయేలా చూడొద్దని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఈ మూడు ప్రాజెక్టుల పరిధిలో నీటి నిల్వ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ, ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం పేర్కొన్నారు.
గోదావరి జలాలను ఎత్తిపోయడంలో ఏ మాత్రం ఆలస్యం చేయొద్దని, వెంటనే అమలు చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నీటి కొరత తీవ్రత తగ్గుతుందని, రైతులకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ప్రాజెక్టుల పరిధిలోని కాలువల నిర్వహణ, నీటి పంపిణీలో సమానత్వం ఉండాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది.





